సోనియా గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

by John Kora |
సోనియా గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
X

- రాష్ట్రపతిపై అభ్యంతరకర పదాలు వాడారని ఆరోపణ

- నోటీసు ఇచ్చిన 21 మంది బీజేపీ ఎంపీలు

దిశ, నేషనల్ బ్యూరో:

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్డ్ మోషన్) నోటీసు ఇచ్చారు. బడ్జెస్ సమావేశాల ప్రారంభం సందర్భంగా జనవరి 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై స్పందించిన సోనియా గాంధీ.. అభ్యంతరకరమైన పదాలు వాడారని నోటీసులో పేర్కొన్నారు. సోనియా గాంధీ మాటలు రాష్ట్రపతి స్థాయిని, గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని, ఇవి పార్లమెంటు సమావేశాల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు ఆ నోటీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే నోటీసును పరిగణలోకి తీసుకొని రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా బీజేపీకి చెందిన 21 మంది ఆదివాసీ ఎంపీలు ఈ నోటీసును ఇవ్వడం గమనార్హంం. పార్లమెంటు నీతి, ప్రవర్తనా నియమావళి ప్రకారం సభ్యులెవరూ ఇతరుల పరువుకు నష్టం చేసేలా మాట్లాడకూడదని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు.

కాగా, బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదాపు గంట సేపు ప్రసంగించారు. దీనిపై సోనియా గాంధీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం చివర్లో అలసి పోయినట్లు కనపడ్డారు. ఇది నాకు జాలి కలిగించిందని (పూర్ థింగ్) సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తన తల్లి ఆ ఉద్దేశంతో అనలేదని, ఆమె కూడా 70 ఏళ్లకు పైబడిన వ్యక్తే అని వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed