ఎథిక్స్ కమిటీ ముందుకు మహువా మొయిత్రా 'క్యాష్ ఫర్ క్వైరీ' ఫిర్యాదు

by Vinod kumar |
ఎథిక్స్ కమిటీ ముందుకు మహువా మొయిత్రా క్యాష్ ఫర్ క్వైరీ ఫిర్యాదు
X

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. ఆమెపై మిషికాంత్ దూబే తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్, ప్రధాని మోదీలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడాలనే ఉద్దేశ్యంతో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా మొయిత్రా కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదు లేఖలో వివరించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో మహువా 61 ప్రశ్నలు అడిగారు. వాటిలో 50 దర్శన్ హీరానందానీ అడిగినందునే మహువా లోక్‌సభలో ప్రశ్నించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు లాయర్ తనకు ఇచ్చారని, తక్షణం మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ విషయంపై విచారణ జరపాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లకు లేఖ రాశారు. లోక్‌సభ వెబ్‌సైట్ లాగ్-ఇన్ వివరాలను ఎవరికైనా ఇచ్చారా లేదా అనే అంశంపై దర్యాప్తు చేయాలన్నారు.

దీనికోసం ప్రత్యేకంగా విచారణ కమిటీ ఉండాలని డిమాండ్ చేశారు. కానీ, నిషికాంత్ దూబే ఆరోపణలపై స్పందించిన మహువా మొయిత్రా, నిషికాంత్‌కు చెందిన నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తు జరిగిన తర్వాతే తనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ ఆరోపణలను హీరానందానీ గ్రూప్ వ్యతిరేకించింది. అవన్నీ నిజాలు కావని, దేశ ప్రయోజనాల కోసం తాము కట్టుబడి ఉంటామని, ప్రభుత్వంతో కలిసి కొనసాగుతామని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed