ఆ స్కామ్‌లో బీజేపీ కూడా భాగమే: ఉద్ధవ్ థాక్రే సంచలన ఆరోపణలు

by samatah |
ఆ స్కామ్‌లో బీజేపీ కూడా భాగమే: ఉద్ధవ్ థాక్రే సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం బీజేపీపై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో జరిగిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో బీజేపీ కూడా భాగమైందని ఆరోపించారు. నాందేడ్ లోక్ సభ నియోజకవర్గంలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి వసంత్ చవాన్ తరఫున ఆయన బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా థాక్రే మీడియాతో మాట్లాడారు. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ అమరవీరుల కుటుంబాలను మోసం చేశారని గతంలో బీజేపీ ఆరోపించింది. కానీ ఆయన ఇప్పుడు అదే పార్టీలో చేరారు. దీంతో బీజేపీ కూడా హౌసింగ్ స్కామ్‌లో భాగమైందని స్పష్టమవుతోంది అని వ్యాఖ్యానించారు.

చవాన్ పార్టీలో జాయిన్ అయ్యాక ఆయనపై బీజేపీ ప్రశంసలు కురిపిస్తోందని తెలిపారు. దీంతో అమరవీరుల కుటుంబాలను మోసం చేయడంలో బీజేపీ ప్రమేయం కూడా ఉందనే సందేహాలు నెలకొంటున్నాయని చెప్పారు. చవాన్ పార్టీని వీడిన తర్వాతే కాంగ్రెస్ కొత్త పుంతలు తొక్కిందని చెప్పారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు వై-ప్లస్ భద్రత కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ..ఆయన కోసం రాకెట్ లాంచర్లు, యుద్ధ ట్యాంకులను కూడా మోహరిస్తున్నట్టు విన్నానని ఎద్దేవా చేశారు. నమ్మక ద్రోహం చేసిన వారికి ఉన్న భద్రత సామాన్యులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రోహులకు మాత్రమే ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని విమర్శించారు.

Advertisement

Next Story