రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..ఎందుకంటే..

by Hajipasha |   ( Updated:2024-03-20 12:32:07.0  )
Rahul Gandhi does not seem to be taking charge as Congress Chief
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘శక్తిపై పోరాటం చేస్తాం’’ అంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై వ్యాఖ్యలు చేసినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి బుధవారం న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి దీనిపై కంప్లయింట్‌ను ఇచ్చారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో అబద్ధాలు చెబుతోంది. ఒకవేళ రాహుల్‌పై చర్యలు తీసుకోకపోతే.. ఆ పార్టీ దూషణల పర్వానికి అదుపు లేకుండా పోతుంది’’ అని మంత్రి హర్దీప్ పేర్కొన్నారు.

ఏమిటీ ‘‘శక్తి’’ వ్యాఖ్యలు ?

ఫిబ్రవరి 17న ముంబైలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘హిందూ మతంలో ‘శక్తి’ అనే పదం ఉంది. మేం ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఆ శక్తి ఏమిటంటే.. ఈవీఎంలో రాజుగారి ఆత్మ ఉంది. ఇది నిజం. రాజుగారి ఆత్మ ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలలో ఉంది’’ అని విమర్శించారు. ఓటింగ్ యంత్రాలు లేకుండా ప్రధాని మోడీ ఎన్నికల్లో గెలవలేరని కాంగ్రెస్ అగ్ర నేత ఆరోపించారు. మరుసటి రోజు తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన బహిరంగ సభ వేదికగా రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. ‘‘హిందూమతంలో శక్తి అంటే దైవ స్వరూపం. ప్రతిపక్ష పార్టీలు శక్తిని నాశనం చేసేందుకు యత్నిస్తున్నాయి. శక్తి విధ్వంసం గురించి ఎవరైనా మాట్లాడుతారా ? ఇది శక్తిని నాశనం చేయాలనుకునే వారికి.. శక్తిని ఆరాధించే వారికి మధ్య జరుగుతున్న పోరాటం’’ అని ప్రధానమంత్రి కామెంట్ చేశారు.

Advertisement

Next Story