2014లో మోడీ ఏం చేశారు?.. బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్

by Shamantha N |   ( Updated:2024-06-18 09:17:27.0  )
2014లో మోడీ ఏం చేశారు?.. బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ పోటీచేయనున్నారు. ఆమెను బరిలో దింపడంపై బీజేపీ స్పందించింది. వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యింది. ఇది కాంగ్రెస్ పార్టీ కాదని, కుటుంబ సంస్థ అని నిరూపించినట్లయ్యిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజలకు ద్రోహం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. రాహుల్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయాన్ని దాచిపెట్టారని పేర్కొన్నారు. తమ కుటుంబం నుంచి ఒకరి తర్వాత ఒకరిని వయనాడ్ ఓటర్లపై రుద్దడం సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓడిపోవడానికి ఈ ద్రోహ విధానమే కారణం అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

బీజేపీకి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

బీజేపీ కామెంట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అదే రేంజులో స్పందించారు. 2014లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మోడీ వడోదర ప్రజల వద్ద దాచిపెట్టారా..? అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ట్రాక్ రికార్డుని ఎత్తి చూపారు. 2014 ఎన్నికల్లో.. గుజరాత్‌లోని వడోదరతో పాటు యూపీలోని వారణాసి నుంచి మోడీ పోటీ చేశారు. రెండుచోట్లా విజయం సాధించడంతో ఆయన వడోదర సీటును వదులుకున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. ఇదిలా ఉంటే.. వయనాడ్‌ నుంచి ప్రియాంక గెలిస్తే.. తొలిసారిగా ఆమె పార్లమెంటులోకి అడుగుపెడతారు. వయనాడ్ నుంచి రాహుల్‌పై సీపీఐకి చెందిన అన్నీ రాజా, బీజేపీకి చెందిన సురేంద్రన్ పోటీ చేశారు. అయితే ఇప్పుడు అన్నీ రాజా బరిలో ఉంటారో, లేదో తెలియాల్సిఉంది.

Advertisement

Next Story

Most Viewed