Biren Singh: ఆరు నెలల్లో శాంతి నెలకొల్పుతాం.. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్

by vinod kumar |
Biren Singh: ఆరు నెలల్లో శాంతి నెలకొల్పుతాం.. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో వచ్చే ఆరు నెలల్లో శాంతి నెలకొల్పుతామని సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో జాతి హింస క్రమంగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. కుకీ, మైతీ తెగల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక ప్రతినిధిని నియమించినట్టు వెల్లడించారు. చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో చర్చలు ప్రారంభించామని, మైతీ, కుకీ ఎమ్మెల్యేలు సమావేశమై డిస్కస్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాంతిభద్రతల స్థాపనకు కృషి చేస్తోందని చెప్పారు. మరో ఆరు నెలల్లో శాంతిని పునరుద్దరిస్తామని తేల్చి చెప్పారు. సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం గురించి అని అడిగిన ప్రశ్నకు బిరేన్ సింగ్ సమాధానమిస్తూ..రిజైన్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయడానికి నేనేం కుంభకోణాలు చేయలేదని చెప్పారు.

2017లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇంఫాల్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్మార్‌ నుంచి అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం, వలసలను అరికట్టామన్నారు. ఈ అణిచివేత వల్ల దెబ్బతిన్నవారు కుకీ, మైతీల మధ్య ఘర్షణలను ప్రేరేపించారని తెలిపారు. తద్వారా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. మార్చి 2023లో మణిపూర్ హైకోర్టు మైతీలకు ఎస్టీ హోదాను సిఫార్సు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల తమ హక్కులు అణిచివేస్తున్నారని భావించిన కుకీలో ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసిందని చెప్పారు. అయితే కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు.

అప్పటికే కుకీ విద్యార్థి సంఘాల ఆందోళనలు ప్రారంభమయ్యాయని వెంటనే అది మొత్తం హింసగా మారిందని తెలిపారు. తర్వాత పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఉద్రిక్తతలు చల్లారలేదన్నారు. కాగా, మణిపూర్‌లో 2023 మే 3 నుంచి కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రిజర్వేషన్లపై హింస కొనసాగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం..ఈ హింస కారణంగా ఇప్పటి వరకు 226 మంది మరణించారు. 1100 మందికి పైగా తీత్రంగా గాయపడ్డారు. 65 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story