Tamilanadu: 'బైక్ ఆంబులెన్స్‌'లను ప్రారంభించిన తమిళనాడు ప్రభుత్వం

by S Gopi |
Tamilanadu: బైక్ ఆంబులెన్స్‌లను ప్రారంభించిన తమిళనాడు ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: గిరిజన, మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో, తమిళనాడు ప్రభుత్వం గురువారం 10 జిల్లాల్లో 25 'బైక్ అంబులెన్స్'లను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,353 వరకు ఉన్న 108 అంబులెన్స్ నెట్‌వర్క్‌కు ఫీడర్ యూనిట్లుగా ఈ బైకులు పనిచేస్తాయి. రూ.1.60 కోట్లతో 25 బైక్ అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ బైక్ ఆంబులెన్స్‌లు అత్యవసర సేవల సమయంలో మొదటగా స్పందించనున్నాయి. రోగికి ప్రాథమిక రక్షణ, మెరుగైన వైద్య సేవలందే వరకు తక్షణ రవాణాను అందిస్తాయి. రాష్ట్రంలోని మారుమూల, కొండ ప్రాంతాల్లో నివశించే వారిలో ఎక్కువ మరణాలు సంభవించిన తర్వాత ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొండ ప్రాంతాల నుంచి గర్భిణులను కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లిన ఘటనలు కూడా గతంలో నమోదయ్యాయి. ఈ చొరవతో కొన్ని ప్రాంతాలకు సకాలంలో వైద్య సదుపాయాలు లభిస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహూ అన్నారు. బైక్ ఆంబులెన్స్‌లు ప్రసూతి సంరక్షణ, లేబర్, సేఫ్ డెలివరీ ట్రాన్స్‌పోర్ట్, చైల్డ్ హెల్త్ చెక్-అప్ వంటి మాతా, శిశు ఆరోగ్య సేవలను అందిస్తాయి. అంతేకాకుండా వైద్య, ప్రమాదవశాత్తు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు, సౌకర్యాలు అందించేందుకు వీలుంటుంది.

Advertisement

Next Story

Most Viewed