ఇండియా కూటమికి భారీ షాక్: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం

by samatah |
ఇండియా కూటమికి భారీ షాక్: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. అత్యంత ఉత్కంఠ నడుమ సాగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి(కాంగ్రెస్-ఆప్) అభ్యర్థి కుల్దీప్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ సోంకర్ గెలుపొందారు. మొత్తం 36 ఓట్లు పోల్ కాగా మనోజ్ కు 16 ఓట్లు, కుల్దీప్ సింగ్ 12ఓట్లు సాధించారు. మరో 8 ఓట్లు చెల్లవని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సోంకర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. 8 ఓట్లు చెల్లవని ప్రకటించడంతో సభలో ఆప్, కాంగ్రెస్ లు నిరసన తెలిపడంతో గందరగోళం నెలకొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని ఆప్ ప్రకటించింది. ఎన్నికల అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించింది. గత ఎన్నికల్లో మొత్తం 35 స్థానాలకు గాను 14 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఏడుగురు, సిరోమణి అకాలీదళ్‌కు 1 సభ్యుడు ఉన్నారు. కాగా, ఈ నెల 18వ తేదీనే జరగాల్సిన ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారి అనారోగ్యంతో ఉండటంతో వాయిదా పడ్డాయి. మరోవైపు, చండీగఢ్ మేయర్ ఎన్నికను ఇండియా కూటమి, బీజేపీకి మధ్య మొదటి పోరుగా ఆప్ పరిగణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ విజయం సాధించడంతో కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

ప్రణాళికలు పనిచేయలేదు: బీజేపీ చీఫ్ నడ్డా

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఆప్, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ‘ఇండియా కూటమి వారి మొదటి ఎన్నికల యుద్ధంలో పోరాడింది. కానీ బీజేపీ చేతిలో ఓటమి తప్పలేదు. వారి లెక్కలు పూర్తిగా పనిచేయలేదు’ అని ట్వీట్ చేశారు. ‘పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగాయి. ‘ఇండియా’ అపవిత్ర కూటమి. కాబట్టి వారి సొంత కౌన్సిలర్లే వారికి ఓటు వేయలేదు’ అని బీజేపీ సీనియర్ నాయకుడు సంజయ్ టాండన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story