బీజేపీకి భారీ షాక్..కాంగ్రెస్‌లోకి మాజీ కేంద్ర మంత్రి

by samatah |
బీజేపీకి భారీ షాక్..కాంగ్రెస్‌లోకి మాజీ కేంద్ర మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు బ్రిజేందర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరిన దాదాపు నెల రోజుల తర్వాత ఆయనఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీరేందర్ సింగ్ భార్య, హర్యానా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ లత కూడా బీజేపీని వీడారు. ఈ మేరకు బీరేందర్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న బీరేందర్ సింగ్ దాదాపు పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు. గత నెలలో హిస్సార్ ఎంపీ, బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ బీజేపీ కి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు. అప్పటి నుంచి బీరేందర్ సింగ్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. కాగా, బీజేపీ వైఖరిని వీరిద్దరూ తరచూ వ్యతిరేకించారు. 2020లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన రైతులకు మద్దతు తెలిపారు. అంతేగాక మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రెజ్లర్లకు సైతం మద్దతిచ్చారు.

Advertisement

Next Story