బ్రేకింగ్ : లోక్ సభ సెక్రటేరియట్ సంచలన నిర్ణయం.. ఆ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-29 06:23:57.0  )
బ్రేకింగ్ : లోక్ సభ సెక్రటేరియట్ సంచలన నిర్ణయం.. ఆ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌పై విధించిన అనర్హత వేటును లోక్ సభ ఉపసంహరించుకుంది. అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తనపై లోక్ సభ విధించిన అనర్హత వేటును సవాలు చేస్తూ పైజల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించడానికి కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం సంచలనంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత మహ్మద్ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో మహ్మద్ ఫైజల్‌ను కవరత్తి సెషన్ కోర్టు దోషిగా తేల్చుతూ పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు ఈ ఏడాది జనవరి 10 తీర్పు వెల్లడించింది.

దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఫైజల్‌పై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. తనకు పడిన శిక్షను సవాలు చేస్తూ పైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో సెషన్ కోర్టు తీర్పును హైకోర్టు నిలిపివేసింది. ఈ నిర్ణయంతో ఆయనపై విధించిన అనర్హత చెల్లుబాటు కాకుండా పోయింది. అయితే తన శిక్షను కేరళ హైకోర్టు నిలిపివేసినా తన సభ్యత్వాన్ని లోక్ సభ సచివాలయం పునరుద్ధరించడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు విచారించడానికి కొద్దిసేపటి ముందు అతని లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం హాట్ టాపిక్ అయింది.

రాహుల్ అనర్హతపై చర్చ

ఫైజల్ విషయంలో పడిన శిక్షను హైకోర్టు నిలిపివేయడం, దాంతో అతడి లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిచడంతో రాహుల్ గాంధీ అంశం కూడా తెరపైకి వస్తోంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు శిక్షతో అతడి ఎంపీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు లోక్ సభ స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్ న్యాయపోరాటం చేసే దిశగా సమాలోచనలు చేస్తోంది. హైకోర్టులో ఫైజల్‌కు అనుకూల తీర్పు రావడంతో రాహుల్ గాంధీ సైతం కోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఇవాళ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించబోతోంది. దీనితో పాటే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed