తమిళనాడులో బీజేపీకి మోడీ ఫ్యాక్టర్ పనికొస్తుందా?

by Hajipasha |
తమిళనాడులో బీజేపీకి మోడీ ఫ్యాక్టర్ పనికొస్తుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో యువత ఓట్లే బీజేపీ ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నుంచి యువత ఓట్లు చీలిపోయి బీజేపీకి పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తమిళ యువతకు ఉన్న అభిమానం ఈ ఎన్నికల్లో ఫలితాల రూపంలో కనిపిస్తుందని చెప్పారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నారాయణన్ తిరుపతి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మద్దతు లేకుండా డీఎంకే 15 నుంచి 16 శాతం ఓట్లను కూడా సాధించలేదన్నారు. అందరూ అనుకుంటున్న విధంగా తమిళనాడులో డీఎంకే అతిపెద్ద పార్టీ కాదని పేర్కొన్నారు. తమిళనాడులో తొలిసారిగా ఓటర్లు బీజేపీకి అనుకూలంగా పెద్దఎత్తున ఓట్లు వేసే అవకాశం ఉందని రాజకీయ వ్యూహకర్త అమితాబ్ తివారీ అంచనా వేశారు. ‘‘ ఒకప్పుడు కాంగ్రెస్‌కు డీఎంకే వ్యతిరేకంగా ఉండేది. ఇప్పుడు అది కాంగ్రెస్‌తో చెయ్యి కలిపింది. ఈ అవకాశవాద రాజకీయాలను ప్రజలు మెచ్చబోరు’’ అని మరో రాజకీయ విశ్లేషకుడు మనీషా ప్రియం పేర్కొన్నారు. ఇక తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘తమిళనాడు నుంచి బీజేపీ ఎక్కువ సీట్లను ఆశించడం లేదు. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని మాత్రమే భావిస్తోంది’’ అని విద్యావేత్త సందీప్ శాస్త్రి అన్నారు. డీఎంకేకు ప్రధాన పోటీదారుగా రాష్ట్ర ప్రజల ఎదుట కనిపించాలనే తాపత్రయం స్పష్టంగా బీజేపీలో కనిపిస్తోందని ఆయన చెప్పారు.

Advertisement

Next Story