Bangladesh: భారత్ నుంచి హసీనా వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలకు ఇబ్బందికరం: బంగ్లాదేశ్

by S Gopi |
Bangladesh: భారత్ నుంచి హసీనా వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలకు ఇబ్బందికరం: బంగ్లాదేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా తొలి అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్.. షేక్ హసీనా భారత్ నుంచి చేస్తున్న ప్రకటనలు మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు వీలుగా లేవని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మతో ఆయన అన్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల సలహాదారు బాధ్యతను నిర్వహిస్తున్న హుస్సేన్.. ఢాకాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో వర్మను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని బంగ్లాదేశ్ కోరుకుంటోందన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశానికి వెలుపల భారత్ నుంచి ప్రకటన చేయడం ఇరు దేశాల మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇబ్బందికరమన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సంఘటనల గురించి మీడియా అతిగా ప్రచారం చేస్తోందన్నారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలతో సహా వివిధ వర్గాల భద్రతకు తాత్కాలిక ప్రభుత్వం హామీ ఇస్తుందని హుస్సేన్ చెప్పారు. అన్ని మతాలు, జాతుల భద్రతకు హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిపై హింస లేదా బెదిరింపులను సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed