Bangladesh : బంగ్లాదేశ్ చరిత్రను మార్చేస్తున్న యూనుస్ సర్కారు

by Hajipasha |
Bangladesh : బంగ్లాదేశ్ చరిత్రను మార్చేస్తున్న యూనుస్ సర్కారు
X

దిశ, నేషనల్ బ్యూరో : నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లాదేశ్‌(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం ఏకంగా దేశ చరిత్రనే మార్చేస్తోంది. మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా కుటుంబం ప్రస్తావన చరిత్ర పుస్తకాల్లో కనిపించకుండా చేసే దిశగా అడుగులు వేస్తోంది. బంగ్లాదేశ్ పాఠ్యపుస్తకాల్లో బంగబంధు ముజిబుర్‌ రహ్మాన్‌ ప్రాధాన్యం తగ్గించేలా పలు మార్పులు చేశారు. 1971 మార్చి 26న బంగ్లా లిబరేషన్‌ వార్‌ సందర్భంగా దేశ స్వాతంత్య్ర ప్రకటనను తొలిసారిగా జియావుర్‌ రహ్మాన్(Ziaur Rahman) చేసినట్టుగా చరిత్ర పాఠాల్లోకి కొత్త విషయాన్ని జోడించారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రకటనను ముజిబుర్‌ రహ్మాన్‌ చేశారు అనేలా గతంలో పాఠ్య పుస్తకాల్లో ఉండేది.

జాతిపితగా ముజిబుర్‌ రహ్మాన్‌ పేరును తొలగించారు. ఈమేరకు మార్పులు చేసి ప్రచురించిన పాఠ్య పుస్తకాలను ప్రాథమిక, సెకండరీ పాఠశాలలకు పంపిణీ చేసే ప్రక్రియను జనవరి 1 నుంచి మొదలుపెట్టారు.‘‘పాక్‌ సైన్యం వద్ద బందీగా ఉన్న టైంలో షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రకటన చేశారనేది వాస్తవం కాదు. అందుకే దాన్ని మేం మార్చాం’’ అని బంగ్లాదేశ్ నేషనల్‌ కరికులమ్‌ టెక్స్ట్‌ బుక్‌ బోర్డ్‌ ప్రొఫెసర్‌ ఏకేఎం రియాజుల్‌ హుస్సేన్‌ తెలిపారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారులు మాత్రం ముజిబుర్‌ రహ్మాన్‌ నాటి మేజర్‌ జియావుర్‌ రహ్మాన్‌తో కలిసి ఈ ప్రకటన చేసినట్లు నమ్ముతారు. ముజిబ్‌ ఆదేశాల మేరకే ఆ ప్రకటనను జియావుర్‌ చదివి వినిపించారని చెబుతారు. బీఎన్‌పీ పార్టీ మాత్రం జియావుర్‌ స్వయంగా ఈ ప్రకటన చేశారని వాదిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed