దిండుతో ఊపిరాడకుండా చేసి ఎంపీ హత్య

by Hajipasha |
దిండుతో ఊపిరాడకుండా చేసి ఎంపీ హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజిమ్‌ అనార్‌ బెంగాల్‌లో దారుణ హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యచికిత్సల కోసం మే 12న కోల్‌కతాకు వచ్చిన ఆయన.. నగరంలోని గోపాల్‌ బిస్వాస్‌ అనే వ్యక్తి ఇంట్లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్‌కు బయలుదేరిన ఎంపీ అన్వరుల్‌ ఇక తిరిగి రాలేదు. దీంతో 18న పోలీసులకు గోపాల్‌ బిస్వాస్‌ ఫిర్యాదు చేశాడు. ఎంపీ అన్వరుల్‌ స్నేహితుడి పేరు అక్తరుజ్జమా. ఇతడు బంగ్లాదేశీయుడే. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. కోల్‌కతా టౌన్‌హాల్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అక్తరుజ్జమాకు ఓ అద్దె ఫ్లాట్ ఉంది. ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి ఆ ఫ్లాట్‌లోకి వెళ్లిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ ప్రాణాలతో బయటికి రాలేదు. ఎంపీ అన్వరుల్‌ అజిమ్‌ ముఖంపై ఇద్దరు వ్యక్తులు దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. ఇటీవల నేపాల్‌లో అరెస్టయిన మహమ్మద్‌ సియామ్‌ హుస్సేన్‌‌ను బెంగాల్ సీఐడీ పోలీసులు విచారించగా ఈవివరాలు వెల్లడయ్యాయి.

హత్య చేశాక ఏం చేశారంటే..

హత్య చేసిన అనంతరం ఎంపీ అన్వరుల్‌కు చెందిన కొన్ని శరీరభాగాలను చిన్న చిన్న ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి న్యూటౌన్‌, బాగ్‌జోలా ప్రాంతంలోని కాల్వల్లో పారేశారు. మరికొన్ని శరీర భాగాలను ఓ సూట్‌ కేసులో ఉంచి బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని బంగాన్‌ ప్రాంతంలో పెట్టి వచ్చారు. ఈ హత్యకు కుట్రదారుడిగా భావిస్తున్న అక్తరుజ్జమా స్నేహితురాలు కూడా తనతోపాటు ఈ హత్యాకాండలో పాల్గొందని పోలీసులకు హుస్సేన్‌ తెలిపాడు. ఈ సమాచారాన్ని ఈనెల 9నే నిందితుల నుంచి బెంగాల్ సీఐడీ విభాగం సేకరించింది. వారు అందించిన వివరాల ప్రకారం.. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ నది ఒడ్డున మనిషి ఎముకలను సేకరించింది. ఒక అపార్ట్‌మెంట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి కొన్ని కిలోల మానవ మాంసాన్ని వెలికితీసింది. దాన్ని డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. మొత్తం మీద బంగ్లాదేశ్ ఎంపీని అతడి స్నేహితుడే దారుణంగా హత్య చేయించాడని విచారణలో తేలింది.

Advertisement

Next Story

Most Viewed