దేవుడు కలలో చెప్పాడని 16 వేల అడుగుల ఎత్తులో గుడిని నిర్మించుకున్న బాబా

by Harish |   ( Updated:2024-07-16 11:58:36.0  )
దేవుడు కలలో చెప్పాడని 16 వేల అడుగుల ఎత్తులో గుడిని నిర్మించుకున్న బాబా
X

దిశ, నేషనల్ బ్యూరో: తనకు తానుగా బాబాగా ప్రకటించుకున్న ఒక వ్యక్తి కలలో దేవుడు చెప్పాడని 16 వేల అడుగుల ఎత్తులో గుడిని నిర్మించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బాగేశ్వర్ జిల్లాలోని మంచు నుంచి ఉద్భవించిన పవిత్రమైన దేవికుంద్‌ సరస్సుకు సమీపంలో సుదేర్ధుంగ నదీ లోయలో బాబాగా పేర్కొంటున్న చైతన్య ఆకాష్ అలియాస్ ఆదిత్య కైలాష్ ఒక గుడిని నిర్మించుకున్నాడు. ఇది సముద్ర మట్టానికి దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.


వాతావరణ మార్పుల పరంగా పర్యావరణ సున్నిత ప్రాంతంలో గుడి కట్టాలని దేవుడు తనకు కలలో చెప్పాడని అక్కడి కొంతమంది స్థానికులతో చెప్పగా, వారి సహాయంతో కర్రలు, రాళ్లతో గుడిని నిర్మించాడు. అతను గత 10-12 రోజులుగా ఆలయంలో నివసిస్తున్నాడు. ఈక్రమంలో పవిత్ర సరస్సు దేవికుంద్‌‌లో స్నానం చేస్తున్నాడు. అయితే అక్కడి ప్రజలు దేవికుంద్‌‌‌ను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈక్రమంలో ఆ బాబా, ఆ సరస్సులో స్నానం చేసి దానిని అపవిత్రం చేయడంపై కొంతమంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బాగేశ్వర్ జిల్లా మేజిస్ట్రేట్ అనురాధ పాల్ మాట్లాడుతూ, స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో విచారణ నిమిత్తం పోలీసులకు సూచించాం. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఆలయాన్ని నిర్మించిన ప్రదేశానికి వెళ్లే రహదారి చాలా కష్టంగా ఉంటుంది. దీనిని వర్షాకాలంలో మూసివేస్తారు. చట్టవిరుద్ధంగా, ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా గుడిని నిర్మించినట్లు ఆమె తెలిపారు.

మొదటగా ఈ గుడిని నిర్మించడానికి అతనికి ఎవరు సహాయం చేయనప్పటికీ కొన్ని మాయమాటలు చెప్పి, వారిని ఒప్పించి గుడి నిర్మాణాన్ని చేపట్టాడు. పోలీసులు ఈ విషయాన్ని శాంతిభద్రతల కోణంలో విచారిస్తున్నారు. అయితే ఈ స్థలం అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని వారు జోక్యం చేసుకోవాల్సి ఉందని బాగేశ్వర్ జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే, చైతన్య ఆకాష్ అలియాస్ ఆదిత్య కైలాష్ గురించి పూర్తి వాకబు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed