ఆయుర్వేద ఔషధ తయారీదారులను హెచ్చరించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

by Disha Web Desk 17 |
ఆయుర్వేద ఔషధ తయారీదారులను హెచ్చరించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి పతంజలిపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో తాజాగా ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలోని ఆయుర్వేద ఔషధ తయారీదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి మందుల తయారీదారులందరూ తమ ఉత్పత్తులకు సంబంధించిన లేబులింగ్, ప్రకటనల్లో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే, అన్ని రాష్ట్రాల్లో మందుల లేబుల్‌లు, ప్రకటనలను పరిశీలించాలని, ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ఆమోదించబడిన మందుల లేబుల్‌లను తనిఖీ చేసి నిర్ధారించాలని రాష్ట్ర డ్రగ్ లైసెన్సింగ్ అధికారులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వంటి ఏ ప్లాట్‌ఫారమ్‌లో అయినా ఏదైనా తప్పుదారి పట్టించే ప్రకటన ఉన్నట్లయితే ఆయా ఔషధ తయారీదారులు చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. ఇటీవల యోగా గురువు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌ బాలకృష్ణకు చెందిన ఉత్పత్తుల ప్రకటనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు పతంజలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అలర్ట్ అయిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఔషధ తయారీదారులకు ఈ హెచ్చరికలు జారీ చేసింది.



Next Story

Most Viewed