Hyderabad: హైదరాబాద్‌లో రూ.31,993 కోట్లు విలువైన 27,820 ఇళ్ల సేల్స్

by Hajipasha |
Hyderabad: హైదరాబాద్‌లో రూ.31,993 కోట్లు విలువైన 27,820 ఇళ్ల సేల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని టాప్-7 మహా నగరాల్లో(Top 7 Cities) రియల్ ఎస్టేట్ బూమ్ అవుతోంది. దీంతో ఇళ్ల ధరలు(Home Prices) క్రమంగా పెరుగుతూపోతున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలైంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో ఏడు ప్రధాన నగరాల్లో ఒక్కో ఇంటిని సగటున రూ.1.23 కోట్ల రేటుకు విక్రయించారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2023-2024) ఇదే కాలంతో పోలిస్తే.. ఒక్కో ఇంటి విక్రయ రేటు సగటున 23 శాతం మేర పెరిగింది. అప్పట్లో ఒక్కో ఇంటి విక్రయ ధర సగటున రూ.1 కోటి పలికింది. ఈమేరకు విశ్లేషణతో అనరాక్(Anarock) సంస్థ ఒక అధ్యయన నివేదికను బుధవారం విడుదల చేసింది. ప్రజల ఆదాయాలు పెరగడంతో పాటు ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపేవారి సంఖ్య పెరగడం వల్ల ధరలు ఈవిధంగా రెక్కలు తొడుగుతున్నాయని నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభ కాలం ముగిసినప్పటి నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబరు వ్యవధిలో టాప్-7 నగరాల్లో 2,27,400 ఇళ్ల విక్రయాలు జరిగాయని అనరాక్ వెల్లడించింది. వీటన్నింటి విక్రయ విలువ దాదాపు రూ.2.79 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.2.35 లక్షల కోట్లు విలువైన 2,35,200 ఇళ్ల విక్రయాలు జరిగాయని గుర్తు చేసింది.

ఏయే నగరంలో ఎన్నెన్ని విక్రయించారంటే..

2024 ఏప్రిల్ - సెప్టెంబరు వ్యవధిలో కొనుగోలుదారులు ఒక్కో ఇంటి కొనుగోలుకు అత్యధికంగా అడ్వాన్సులు ఇచ్చిన నగరాల జాబితాలో ముంబై (రూ.1.47 కోట్లు), ఢిల్లీ (రూ.1.45 కోట్లు), బెంగళూరు (రూ.1.21 కోట్లు), హైదరాబాద్ (రూ.1.15 కోట్లు) ఉన్నాయి. ఆ ఆరు నెలల టైంలో ముంబైలో రూ.1.14 లక్షల కోట్లు విలువైన 77,735 ఇళ్లను విక్రయించగా.. హైదరాబాద్‌లో రూ.31,993 కోట్లు విలువైన 27,820 ఇళ్లను విక్రయించారు. ఢిల్లీలో రూ.46వేల కోట్లు విలువైన 32వేల ఇళ్లను విక్రయించగా.. బెంగళూరులో రూ.37వేల కోట్లు విలువైన 31వేల ఇళ్లను సేల్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed