ప్రభుత్వోద్యోగులు రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు: అస్సాం సీఎం!

by Disha Web Desk 23 |   ( Updated:2023-10-27 12:16:11.0  )
ప్రభుత్వోద్యోగులు రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు: అస్సాం సీఎం!
X

దిస్పూర్: అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగులు జీవిత భాగస్వామి జీవించి ఉండగా రెండో పెళ్లి చేసుకోవడానికి 'అర్హత' లేదని, వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. తమ సర్వీస్ నిబంధనల ప్రకారం అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రెండవ వివాహానికి అనుర్హులని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రస్తుతం అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏ మతంలోనైనా రెండవ వివాహం చేసుకునే వెసులుబాటు ఉంటే గనక అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి ఇద్దరు భార్యలు పింఛన్‌ కోసం క్లెయిమ్‌ చేయడంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నీరజ్ వర్మ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు అందరికీ ఉత్తర్వులను జారీ చేశారు. మొదటి వివాహం చేసుకున్న భార్య జీవించి ఉంటే రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల అసోం అడ్వకేట్ జనరల్ దేవజిత్ లోన్ సైకియా ఆధ్వర్యంలో అస్సాం ప్రభుత్వం బహుభార్యత్వం రద్దు గురించి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story