Ashwini Vaishnaw: రైల్వే ప్రయాణికులను కాంగ్రెస్ భయపెడుతోంది.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

by vinod kumar |
Ashwini Vaishnaw: రైల్వే ప్రయాణికులను కాంగ్రెస్ భయపెడుతోంది.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రైల్వే ప్రయాణికులను కాంగ్రెస్ పార్టీ భయపెడుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాలు, ప్రస్తుత రైల్వే సేవలపై ప్రతిపక్షాల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన గురువారం లోక్ సభలో మాట్లాడారు. సభలో అరుస్తున్న వారు 58 ఏళ్లుగా అధికారం ఉన్నారని, అయినప్పటికీ కిలోమీటరు దూరం కూడా ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (ఏటీపీ) ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు. అటువంటి వారు ప్రశ్నలు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ‘మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదాల సంఖ్య 0.24 నుంచి 0.19కి తగ్గిందని చెప్తే..సభలో చప్పట్లు కొట్టారు. కానీ నేడు 0.19 నుంచి 0.3కి తగ్గిందని చెప్తుంటే మాత్రం ఆరోపణలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని, లక్షలాది మంది రోజువారీ రైల్వే ప్రయాణికుల్లో అనవసర భయాన్ని కలిగిస్తోందని ఆరోపించారు. ప్రతిరోజూ రైల్వేలో ప్రయాణించే 2 కోట్ల మంది ప్రజల్లో భయాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో 4 లక్షల 11 వేల మంది ఉద్యోగులు మాత్రమే రైల్వేలో రిక్రూట్ అయ్యారని, 2014 నుంచి 2024 వరకు ఈ సంఖ్య 5 లక్షల 2 వేలకు చేరుకుందని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో రైల్వే రిక్రూట్ మెంట్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబరులో 40,565 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed