ఇండియా కూటమికి మరో షాక్: కశ్మీర్‌లో ఒంటరిగా పోటీ చేయనున్న నేషనల్ కాన్ఫరెన్స్

by samatah |
ఇండియా కూటమికి మరో షాక్: కశ్మీర్‌లో ఒంటరిగా పోటీ చేయనున్న నేషనల్ కాన్ఫరెన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ ఫరూర్ అబ్దుల్లా గురువారం తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయం ఇక లేనే లేదని తేల్చి చెప్పారు. కూటమిపై ఎలాంటి ప్రశ్నలు తలెత్తకూడదని తెలిపారు. సొంత బలంతో కశ్మీర్‌లో బరిలోకి దిగుతమన్నారు. పార్లమెంటు ఎన్నికలతో పాటే జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించే చాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. కూటమి నుంచి బయటకు రావడానికి గల కారణాలను ఫరూక్ వెల్లడించలేదు. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన సీట్ షేరింగ్ విషయంలో ఏకాబిప్రాయం లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీట్ల పంపకాలపై ఉన్న అసంతృప్తిలోనే ఫరూక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అబ్దుల్లాకు సమన్లు ​​జారీ చేసింది. వీటిని ఆయన తిరస్కరించగా..ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం వెలువడటం గమనార్హం.

చర్చలు కొనసాగుతున్నాయి: జైరాం రమేశ్

జమ్మూ కశ్మీర్‌లో పొత్తు ఉండబోదని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ స్పందించారు. అబ్దుల్లాతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘ప్రతి పార్టీకి వారి స్వంత పరిమితులు ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. అలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు. కాగా, ఇప్పటికే బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీని వీడటం, బెంగాల్‌లో సీట్ షేరింగ్ లేదని మమతా ప్రకటించడం, ఆప్ సైతం అదే తరహా నిర్ణయాలు తీసుకోవడంతో కూటమికి వరుస షాక్‌లు తగలగా..ఫరూక్ అబ్దుల్లా నిర్ణయంలో మరో ఎదురుదెబ్బ తాకింది.

Advertisement

Next Story

Most Viewed