తప్పు చేశాడు కాబట్టే కేజ్రీవాల్ అరెస్ట్ : అన్నా హజారే

by Hajipasha |
తప్పు చేశాడు కాబట్టే కేజ్రీవాల్ అరెస్ట్ : అన్నా హజారే
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్‌ పాలసీ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ తప్పు చేశారు కాబట్టే అరెస్టయ్యారని ఆయన మండిపడ్డారు. సొంత లాభం కోసం లిక్కర్ పాలసీలు చేశారు కాబట్టే కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని దుయ్యబట్టారు. ‘‘ఢిల్లీ లిక్కర్‌ పాలసీని తయారు చేస్తున్నారని తెలియడంతో నేను కేజ్రీవాల్‌కు రెండుసార్లు లేఖలు రాశాను. మద్యంతో ఆదాయాన్ని ఆర్జించే ఆలోచనల జోలికి పోవద్దని సూచించాను. అయినా పట్టించుకోలేదు’’ అని అన్నా హజారే పేర్కొన్నారు. ‘‘మద్యం ఓ రకమైన మత్తులో ముంచుతుంది. అధికారం మరో రకమైన మత్తులో ముంచుతుంది. అధికారమనే మత్తులో చేసిన చేష్టల ఫలితాన్నే ఇప్పుడు కేజ్రీవాల్ అనుభవిస్తున్నారు’’ అని ఆయన తెలిపారు. తనతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా గొంతెత్తి నిరసనలు చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంటి వ్యక్తి.. మద్యం పాలసీ రూపొందించాడని తలుచుకుంటేనే బాధ కలుగుతోందన్నారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పని చేసినందుకు సిగ్గుపడుతున్నా.. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా నాతో ఉన్నపుడు దేశ సంక్షేమానికి పాటుపడాలని వాళ్లకు చెప్పేవాణ్ని’’ అని అన్నా హజారే గుర్తు చేసుకున్నారు. ‘‘కేజ్రీవాల్ పరిస్థితిని చూసి నాకేం బాధగా అనిపించడం లేదు. ఇప్పుడు నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వను. గతంలోనూ అతడు నా మాటలు వినిపించుకోలేదు. అయినా ఇప్పుడు ఏం చేయలేం. చట్టం తనపని తాను చేసుకుపోతుంది’’ అని అన్నా హజారే కామెంట్ చేశారు. శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed