Amith shah: ఆర్గానిక్ ఉత్పత్తులకు భారీ డిమాండ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amith shah: ఆర్గానిక్ ఉత్పత్తులకు భారీ డిమాండ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్, అమూల్ బ్రాండ్లు వినియోగదారులకు నమ్మకమైన సేంద్రీయ ఆహారాన్ని అందజేస్తున్నాయని కొనియాడారు. నేషనల్ కో-ఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్ఓసీఎల్), ఉత్తరాఖండ్ ఆర్గానిక్ కమోడిటీ బోర్డు (యూఓసీబీ) మధ్య శుక్రవారం అమిత్ షా సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశంలోని విస్తారమైన సాగు భూమిని సేంద్రీయ వ్యవసాయానికి సిద్ధం చేయాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు.

ప్రపంచ మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి మార్కెట్ సైతం ఉందన్నారు. దేశ పౌరుల ఆరోగ్యం కూడా సేంద్రీయ వ్యవసాయంతో ముడిపడి ఉందని తెలిపారు. ఎరువుల వాడకం ద్వారా మన శరీరంలోకి చేరిన రసాయనాలు అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయని, అంతేగాక భూమి నాణ్యత కూడా తగ్గిపోతుందన్నారు. చాలా రాష్ట్రాల్లో భూమి గట్టిపడటం ప్రారంభించిందని తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేసే యంత్రాంగం ఇంతకు ముందు లేదని, ఈ సమస్యను పరిష్కరించడానికి మోడీ ఎన్ఓసీఎల్‌ను స్థాపించిందని చెప్పారు.

Advertisement

Next Story