- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాచల్‌లో పొలిటికల్ హీట్.. ఆరుగురు రెబల్స్.. ఒక మంత్రి.. ఒక్క సీఎం
దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్ రాజకీయం హీటెక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుంచి గెలవాల్సిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మనుసింఘ్వి ఓడిపోవడం కలకలం క్రియేట్ చేసింది. ఏకంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఫలితం ఈవిధంగా మారిపోయింది. మంగళవారం రోజు రాజ్యసభ ఎన్నికల వేళ క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఆ వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలోని పంచకుల నగరానికి వెళ్లిపోయారు. మరోవైపు బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలను, మంత్రులను సీఎం సుఖ్వింధర్‌సింగ్ సుఖు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సీఎం మొండివైఖరి వల్లే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని మండిపడ్డారు. ఈనేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, సీనియర్ నేత భూపీందర్ సింగ్ హుడాలను అబ్జర్వర్లుగా హిమాచల్‌లోని సిమ్లాకు పంపింది. వారు హిమాచల్ సీఎం సుఖ్వింధర్‌సింగ్ సుఖు, రాజీనామా ప్రకటించిన మంత్రి విక్రమాదిత్య సింగ్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను క్షమించేందుకు రెడీ : సీఎం
అనంతరం సీఎం సుఖ్వింధర్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను క్షమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వాళ్లంతా వచ్చి మునుపటిలాగే పార్టీలో కొనసాగొచ్చన్నారు. క్షమాగుణం కాంగ్రెస్ పార్టీలోని ఉన్నతమైన విలువలకు నిదర్శనమని చెప్పారు. ఇక మంత్రి విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. ‘‘రాజీనామాను ఆమోదించమని నేను ఇక పదేపదే సీఎంను ఒత్తిడి చేయను. అంతే తప్ప రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదు. ఇవి రెండూ వేర్వేరు అంశాలని గ్రహించాలి’’ అని తెలిపారు. మరోవైపు బుధవారం హిమాచల్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా గట్టిగా అరిచారనే కారణంతో బీజేపీకి చెందిన మొత్తం 25 మంది ఎమ్మెల్యేల్లో 15 మందిని అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా సభ నుంచి సస్పెండ్ చేశారు.
స్పీకర్ ఎదుటకు ఆ ఆరుగురు
ఇక క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును విధించే దిశగా చర్యలు మొదలయ్యాయి. దీనిపై ఆ ఆరుగురికి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా తమ న్యాయవాది సత్యపాల్ జైన్‌తో కలిసి స్పీకర్ ఎదుట హాజరయ్యారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల టైం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన స్పీకర్.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించే అంశంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశానని వెల్లడించారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్య్ర అభ్యర్థులు ఉన్నారు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు.అంటే బీజేపీ బలం 25 నుంచి 34కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 1 సీటు దూరంలో బీజేపీ నిలిచిందన్న మాట.