బీజేపీ ప్రభుత్వ అంతర్గత పోరుతో యూపీ ప్రజలు విసిగిపోయారు: అఖిలేష్ యాదవ్

by Harish |
బీజేపీ ప్రభుత్వ అంతర్గత పోరుతో యూపీ ప్రజలు విసిగిపోయారు: అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత పోరు నడుస్తుందని అన్నారు. అధికార బీజేపీ నాయకులు తమలో తాము పోరాడుతున్నారు. అవినీతి చేయడంలో పరస్పరం పోటీ పడుతుండటంతో పరిపాలన అటకెక్కింది, ఇతర పార్టీల్లో చీలికలకు శ్రీకారం చుట్టిన బీజేపీకి ఇప్పుడు లోపల అదే జరుగుతుంది, అందుకే అంతర్గత పోరు ఊబిలో కూరుకుపోతోందని అఖిలేష్ ఆరోపించారు. ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎవరూ కూడా బీజేపీలో లేరని ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మంచి ప్రదర్శన చేస్తుందన్న నమ్మకం ఉందని అఖిలేష్ చెప్పారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు కేశవ్ ప్రసాద్ మౌర్య రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం కంటే పార్టీ నిర్మాణం, దాని క్యాడర్ ముఖ్యమని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ పార్టీ కార్యకర్తలను గౌరవించాలని అన్నారు. దీంతో పార్టీలో ఏదో జరుగుతుందని ఊహాగానాలు వచ్చాయి. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకుల సమావేశంలో సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో "అతి విశ్వాసం" పార్టీని తీవ్రంగా నష్టపరిచిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో దీనికి కౌంటర్‌గా అఖిలేష్ యాదవ్ తాజాగా బీజేపీపై విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఫలితాలు అధికార బీజేపీకి షాక్ ఇచ్చాయి. మొత్తం 80 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలను కైవసం చేసుకోగా, కాషాయ పార్టీకి 33 సీట్లు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed