అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం సక్సెస్.. చైనాకు చెక్.. ఎలా ?

by Hajipasha |   ( Updated:2024-03-11 13:35:05.0  )
అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం సక్సెస్.. చైనాకు చెక్.. ఎలా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘మిషన్ దివ్యాస్త్ర’లో భాగంగా అగ్ని-5 క్షిపణికి సంబంధించిన తొలి ఫ్లైట్ టెస్ట్‌ను సోమవారం భారత్ విజయవంతంగా నిర్వహించింది. 5వేల కి.మీలకు మించిన దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఈ మిస్సైల్‌కు ఉంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వీ) టెక్నాలజీతో పనిచేసేలా ఈ మిస్సైల్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తయారు చేసింది. ఒకే క్షిపణి వివిధ రకాల వార్ హెడ్ల నుంచి ప్రయోగించగల సామర్థ్యాలను సంతరించుకోవడమే ఎంఐఆర్‌వీ టెక్నాలజీ ప్రత్యేకత. స్వదేశీ ఏవియానిక్స్ సిస్టమ్‌లు, అధిక ఖచ్చితత్వపు సెన్సార్ ప్యాకేజీలను అగ్ని-5 మిస్సైల్‌లో జోడించారు. అగ్ని-5 ఫ్లైట్ టెస్ట్ సక్సెస్ అయిన సందర్భంగా డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. వారిని చూసి తాను గర్విస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

చైనాకు చెక్

చైనా వద్ద డాంగ్‌ఫెంగ్-41 పేరుతో క్షిపణులు ఉన్నాయి. ఇవి 12,000 కి.మీ నుంచి 15,000 కి.మీ రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదించగలవు. వాటికి పోటీగా భారత్ ‘అగ్ని -5’ మిస్సైల్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. అగ్ని 1 నుంచి అగ్ని 4 దాకా మిస్సైళ్ల రేంజ్ 700 కి.మీ నుంచి 3,500 కి.మీల మధ్య ఉంటుంది. గతేడాది జూన్‌లో భారత్ అణు సామర్థ్యం కలిగిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. గతేడాది అక్టోబర్‌లోనూ ఓ క్షిపణి పరీక్షను నిర్వహించింది. తాజాగా భారత్ విజయవంతంగా పరీక్షించిన అగ్ని-5 మిస్సైల్ ఆసియా ఖండంలోని పలు దేశాలు, చైనా ఉత్తర భాగంతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేయగలదు. అగ్ని-5 క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా మహిళా మణి డాక్టర్ టెస్సీ థామస్ ఉన్నారు. ఆమెను ‘మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తున్నారు. భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా ఆమె రికార్డును నెలకొల్పారు.

Advertisement

Next Story

Most Viewed