Anna Hazare: రాజకీయాల్లోకి రావద్దని గతంలోనే సూచించా.. కేజ్రీవాల్ పై అన్నాహజారే కామెంట్లు

by Shamantha N |   ( Updated:2024-09-16 10:09:14.0  )
Anna Hazare: రాజకీయాల్లోకి రావద్దని గతంలోనే సూచించా.. కేజ్రీవాల్ పై అన్నాహజారే కామెంట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్.. తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనిపైనే అన్నా హజారే (Anna Hazare) స్పందించారు. రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు తాను గతంలోనే సూచించినట్లు తెలిపారు. అయితే ఆయన తన మాట వినలేదని విమర్శించారు. ‘ రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు గతంలోనే సలహా ఇచ్చా. సామాజిక సేవలోనే నిజమైన విలువ ఉంటుందని ఎన్నోసార్లు వివరించా. కానీ ఆయన వినలేదు. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకూడదని నేను మొదటి నుంచి చెబుతున్నా. ఆయన నా సలహాను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జరిగింది అనివార్యం. అసలు, ఆయన మనసులో ఏం ఆలోచన ఉందో నాకు తెలియదు’ అని హజారే అన్నారు.

గతంలోనూ కేజ్రీవాల్ పై విమర్శలు

ఇకపోతే, కేజ్రీవాల్ గురించి అన్నాహజారే మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌పైనా అన్నా హజారే అసహనం వ్యక్తం చేశారు. ‘ఒకప్పుడు నాతో పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం విధానాలను రూపొందించడంలో నిమగ్నం కావడంపై నేను తీవ్రంగా కలత చెందా. సొంత చర్యల పర్యవసానమే ఆయన అరెస్ట్‌’ అని వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేసి దేశ రాజధానిలో ముందస్తు ఎన్నికలకు వెళ్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నా హజారే వ్యాఖ్యలు హైలెట్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed