వ్యభిచారం.. పిల్లల కస్టడీ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
వ్యభిచారం.. పిల్లల కస్టడీ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : వ్యభిచార అభియోగంతో విడాకులను ఇవ్వగలం కానీ.. ఆ అంశం ప్రాతిపదికన పిల్లల కస్టడీపై నిర్ణయాన్ని తీసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి కుమారుడికి ఒక మహిళతో పెళ్లయింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ దూరంగా జీవిస్తున్నారు. తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. ఆమె తల్లి వద్దే ఉండేది. అయితే సదరు బాలిక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తండ్రి ఇంటికొచ్చింది. అక్కడి నుంచి తల్లి వద్దకు తిరిగి వెళ్లకుండా ఆమెను తండ్రి అడ్డుకున్నాడు. ఈవిషయం తెలియడంతో బాలిక తల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. వెంటనే ఆమెను తల్లి కస్టడీకి అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాలిక తండ్రి తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు వినే క్రమంలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక మహిళ మంచి భార్య కాదంటే.. ఆమె మంచి తల్లి కాదని అర్థం కాదు. వ్యభిచారం అనేది విడాకులకు ప్రాతిపదిక కావచ్చు. కానీ పిల్లలను ఎవరి కస్టడీకి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి దాన్ని ప్రాతిపదికగా పరిగణించలేం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘తల్లి వద్ద ఉన్న టైంలో బాలిక చదువులో బాగా రాణిస్తోంది. ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉంది. అలాంటప్పుడు తల్లి కస్టడీలోనే బాలిక కొనసాగితే బాగుంటుంది’’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 21లోగా బాలికను తల్లికి అప్పగించాలని తండ్రిని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed