మర్డర్ చేశాక 40 లక్షల అప్పు చేసి.. నటుడు దర్శన్ ఏం చేశాడంటే..

by Hajipasha |
మర్డర్ చేశాక 40 లక్షల అప్పు చేసి.. నటుడు దర్శన్ ఏం చేశాడంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : రేణుకాస్వామిని కన్నడ నటుడు దర్శన్‌ హత్య చేసిన కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. కొంతమందితో కలిసి రేణుకాస్వామిని దారుణంగా మర్డర్ చేసిన దర్శన్.. ఆ తర్వాత ఆధారాలను మాయం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాక్ష్యాలు ఎవరికీ దొరకకుండా చేసే వ్యవహారంపై ఖర్చు పెట్టేందుకు తన స్నేహితుడు, బీజేపీ నేత మోహన్ రాజ్ వద్ద దర్శన్ రూ.40 లక్షలు అప్పు చేశాడని పోలీసు విచారణలో బహిర్గతమైంది. పోలీసుల సోదాల్లో నటుడు దర్శన్‌కు సంబంధించిన నివాసాల్లో దాదాపు రూ.40 లక్షలు లభ్యమయ్యాయి. మరో రూ.30 లక్షలను ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులకు దర్శన్ చెల్లించాడని దర్యాప్తులో తేలింది. ఈ కేసుతో ముడిపడిన మొత్తం రూ.70 లక్షల వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖకు కర్ణాటక పోలీసులు సమాచారం అందించారు.

రేణుకాస్వామి హత్యకు పవిత్ర గౌడే ప్రధాన కారణమని, ఆమెనే ఈ కేసులో ఏ1 నిందితురాలు అని పోలీసులు తెలిపారు. ఇతర నిందితులను ఆమె ప్రేరేపించి, వారితో కుట్ర చేసి, నేరంలో పాల్గొన్నట్లు తేల్చారు. రేణుకాస్వామిని హత్య చేయడాన్ని సంఘటనా స్థలంలోనే ఉండి పవిత్ర గౌడ కళ్లారా చూసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈమేరకు సంచలన వివరాలతో కూడిన రిమాండ్‌ రిపోర్టును పోలీసులు శుక్రవారం బెంగళూరు కోర్టుకు సమర్పించారు. ఇప్పటివరకు తమ కస్టడీలోనే ఉన్న దర్శన్, ధన్‌రాజ్‌, వినయ్‌, ప్రదోష్‌ విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. నటుడు దర్శన్‌తో కలిసి ఆధారాలను ధ్వంసం చేయడంలో ప్రదోష్‌ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మిగతా నిందితులను కూడా తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed