Amitabh Jha: యూఎన్ శాంతి పరిరక్షక దళం కమాండర్ అమితాబ్ ఝా కన్నుమూత

by Shamantha N |
Amitabh Jha: యూఎన్ శాంతి పరిరక్షక దళం కమాండర్ అమితాబ్ ఝా కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా(Amitabh Jha) కన్నుమూశారు. ఈవిషయాన్ని భారతసైన్యం(Indian Army) ధ్రువీకరించింది. అయితే, ఆయన మృతికి గల కారణాలాను మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లోని గోలన్ హైట్స్‌లో ఐక్యరాజ్యసమితి డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్(UNDOF) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (DFC)గా బ్రిగేడియర్ అమితాబ్ ఝా పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మిషన్ యాక్టింగ్ ఫోర్స్ కమాండర్‌గా కూడా ఉన్నారు. ఆయన మరణం పట్ల భారత సైన్యం సంతాపం ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా సీనియర్ సైనిక కమాండర్లు సంఘీభావం ప్రకటించారు. ఆయన భౌతికకాయాన్ని భారత్ తీసుకువస్తున్నారు. దేశానికి, అంతర్జాతీయ సమాజానికి సేవ చేసిన ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గోలన్ హైట్స్ లో ఉద్రిక్తతలు

ఇకపోతే, బ్రిగేడియర్ ఝా యూఎన్ మిషన్‌లకు మద్దతు ఇస్తూ ప్రపంచశాంతిని కొనసాగించడంలో భారత్ నిబద్ధతను ప్రపంచానికి చాటి చెప్పారు. యూఎన్ శాంతి పరిరక్షక ప్రయత్నాలకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కాగా.. బ్రిగేడియర్ ఝా దళం మోహరించిన గోలన్ హైట్స్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 1974 నుండి UNDOF పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాంతం ఇజ్రాయెల్- సిరియా మధ్య ఒక బఫర్ జోన్. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని నివారించేందుకు యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత దీని స్థాపన జరిగింది. గత కొన్ని నెలలుగా గోలన్ హైట్స్ ప్రాంతంలో సిరియన్ ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న శాంతి పరిరక్షణ దళం, సాధారణ ప్రజలు భద్రతా సమస్యలు ఎదుర్కొన్నారు. బ్రిగేడియర్ ఝాతో సహా శాంతి పరిరక్షక దళం కాల్పుల విరమణ ఒప్పందాలను పర్యవేక్షించడంలో, మానవతా ప్రయత్నాలను సులభతరం చేయడంలో, ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న పౌరులకు భద్రత ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed