Census: సెప్టెంబర్‌లో దేశ జనాభా లెక్కింపు స్టార్ట్..!

by Harish |
Census: సెప్టెంబర్‌లో దేశ జనాభా లెక్కింపు స్టార్ట్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో జనాభా లెక్కింపుపై గత కొన్నేళ్లుగా కాలయాపన జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ వర్గాలు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌కి అందించిన సమాచారం ప్రకారం, భారతదేశ జనాభా గణనను సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. కొత్త సర్వే వచ్చే నెలలో ప్రారంభమై, పూర్తి కావడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని సంబంధిత వర్గాల వారు పేర్కొన్నారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఒక టైమ్‌లైన్‌ను రూపొందించాయి. జనాభా లెక్కింపు వివరాలను మార్చి 2026 నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి పీఎం కార్యాలయం నుండి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు పేర్కొన్నారు.

దేశంలో చివరిసారిగా జనాభా లెక్కింపు 2011లో జరిగింది. ప్రస్తుతం ఈ లెక్కింపు డేటా ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, ఆర్థిక డేటాను రూపొందిస్తున్నారు. దేశంలో దశాబ్దానికి ఒకసారి జరిగే జనాభా గణన 2021 లో పూర్తి కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. గత కొన్నేళ్లుగా జనాభా లెక్కింపు చేపట్టాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

జనాభా గణనను చేపట్టడం ద్వారా ద్రవ్యోల్బణం, పథకాలు, ఉద్యోగాల అంచనాలతో సహా అనేక ఇతర గణాంకాలపై స్పష్టత వస్తుంది. ప్రభుత్వం జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపకల్పన చేసే అవకాశాన్ని పొందుతుంది. గత ఏడాది విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమించింది.

Advertisement

Next Story