జమ్మూకశ్మీర్‌లో 24 మందిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు

by Harish |   ( Updated:2024-07-10 13:12:57.0  )
జమ్మూకశ్మీర్‌లో 24 మందిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో కథువా జిల్లాలో ఇటీవల ఆర్మీ పెట్రోలింగ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే. దాడి చేసిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారంతో ఆర్మీ, పోలీసులు కలిసి నిర్వహిస్తున్న సెర్చ్ ఆపరేషన్ బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో 24 మందిని దాడి గురించి ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నారు.

కథువాతో పాటు నాలుగు జిల్లాల్లోని దట్టమైన అడవుల్లో అడపాదడపా భారీ వర్షం కురుస్తున్నప్పటికి కూడా ఆర్మీ, పోలీసులు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం సాంబాలోని లాలా చాక్ ప్రాంతం, రాజౌరిలోని మంజాకోట్ ప్రాంతం, పూంచ్‌లోని సూరంకోట్‌లలో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉధంపూర్, సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో సైన్యం, పోలీసు సిబ్బందిని మోహరించారు.

సెర్చింగ్ చేస్తున్న సిబ్బందికి సపోర్ట్‌గా హెలికాప్టర్, యూఏవీ నిఘా ద్వారా సహాయం అందిస్తున్నారు. అదనంగా, వారు స్నిఫర్ డాగ్‌లు, మెటల్ డిటెక్టర్‌లను ఉపయోగిస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం కథువా దాడి ప్రదేశాన్ని సందర్శించి, దర్యాప్తులో పోలీసులకు సహాయం చేస్తోందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కథువా దాడి ఘటనతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. తమ ఆత్మరక్షణ కోసం గ్రామ రక్షణ బృందాలను మంజూరు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed