Delhi's New Chief Minister: వీడిన సస్పెన్స్.. ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ

by Shamantha N |   ( Updated:2024-09-17 06:39:13.0  )
Delhis New Chief Minister: వీడిన సస్పెన్స్.. ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా.. మంత్రి అతిశీ పేరుని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కేజ్రీవాల్‌ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు దిలీప్ పాండే ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. కాగా.. కేజ్రీవాల్ అతిశీ పేరుని ప్రతిపాదించినప్పుడు ఆప్ ఎమ్మెల్యేలందరూ నిలబడి ఆనిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో శాసనసభా పక్ష నేతగా అతిశీ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత అతిశీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలిసేందుకు కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్‌ కోరారు. సాయంత్రం 4.30 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

అన్నీ తానై..

ఇకపోతే, విధాన సంస్కరణలు, సామాజిక సమస్యలపై అతిశీ డైనమిక్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయినప్పట్నుంచి ఆప్‌ పార్టీ వ్యవహారాలను అన్నీ తానై చూశారు. అరవింద్ కేజ్రీవాల్ లేకపోయినప్పటికీ ప్రభుత్వ పనితీరులో కీలక పాత్ర పోషించారామె. కేబినేట్ లో ఆమె 14 శాఖలకు బాధ్యత వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను ఆమెనే చూస్తున్నారు. అతిషి ఢిల్లీ అసెంబ్లీలో విద్యకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆమె బలమైన వాక్చాతుర్యం ఉన్న నేతగా ఆప్‌లో గుర్తింపు పొందారు. ఈ అనుకూలతలన్నీ ఆమె సీఎం అయ్యేందుకు కలిసి వచ్చాయి.

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ సమావేశాల్లోనే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలను నవంబర్‌లో మహారాష్ట్రతో పాటు నిర్వహించాలని ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed