యూపీలో ఇండియా కూటమికి షాక్: ఎన్డీయేలో చేరనున్న ఆర్ఎల్‌డీ!

by samatah |
యూపీలో ఇండియా కూటమికి షాక్: ఎన్డీయేలో చేరనున్న ఆర్ఎల్‌డీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాల ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగలనున్నట్టు తెలుస్తోంది. ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ జయంత్ చౌదరి ఓ బీజేపీ సీనియర్ నాయకుడితో ఇటీవలే ఢిల్లీలో సంప్రదింపులు జరిపినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. యూపీలోని కైరానా, బాగ్‌పత్, మధుర, మ్రోహా లోక్‌సభ స్థానాలను ఆర్ఎల్‌డీకి కాషాయ పార్టీ ఆఫర్ చేసినట్టు తెలిపాయి. అంతేగాక ఓ రాజ్యసభ సీటు సైతం ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. పార్లమెంటు ఎన్నికలకు నెల రోజుల మందు రెండు పార్టీలు జతకట్టడం దాదాపు ఖాయమని పేర్కొన్నాయి. అయితే ఇటీవల యూపీలోని ఛప్రౌలీలో తన తాత చౌదరి చరణ్‌సింగ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన కార్యక్రమాన్ని జయంత్ వాయిదా వేశారు. ఇండియా నుంచి తప్పుకునేందుకే దీనిని పోస్ట్ పోన్ చేశారని, ఎన్డీయేలో చేరడం ఖాయమయ్యాక ఈ ప్రోగ్రాంకు ప్రధాని మోడీ హాజరవుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఇండియా కూటమికి పెద్ద షాక్ తగలనుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమికి హ్యాండివ్వడం..తాజాగా యూపీలోని ఆర్ఎల్డీ సైతం తప్పుకుంటున్నట్టు ఊహాగానాలుు వెలువడంతో కూటమి నేతలు షాక్‌కు గురవుతున్నారు.

అఖిలేష్ వైఖరే కారణమా!

ఇండియా కూటమికి నుంచి ఆర్ఎల్‌డీ తప్పుకోవడానికి ప్రధాన కారణం సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వైఖరే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీకి ఆర్ఎల్‌డీ కీలక మిత్రపక్షంగా ఉంది. అయితే ఇటీవల అఖిలేష్ మాట్లాడుతూ..ముజఫర్‌నగర్, కైరానా, బిజ్నోర్ లోక్‌సభ స్థానాల నుంచి ఆర్ఎల్‌డీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని తెలిపారు. ఈ ప్రకటనతో జయంత్ చౌదరి అసంతృప్తికి గురైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కూటమి నుంచి వైదొలగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ ఆధిపత్యం చెలాయిస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్‌ఎల్‌డీ ఎస్పీతో పొత్తు పెట్టుకుని 33 స్థానాల్లో పోటీ చేయగా.. 9 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో సీట్ల షేరింగ్‌పై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి. ఎస్పీ ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, 25 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు 11 స్థానాలను మాత్రమే ఆఫర్ చేసింది. ఈ క్రమంలోనే ఆర్ఎల్‌డీ కూటమికి దూరమతున్నట్టు సంకేతాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story