2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వారిలో 93 శాతం అభ్యర్థులు 'కోటీశ్వరులు': ఏడీఆర్

by S Gopi |
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వారిలో 93 శాతం అభ్యర్థులు కోటీశ్వరులు: ఏడీఆర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 543 మంది అభ్యర్థుల్లో 93 శాతం(504) కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2009లో గెలిచిన వారిలో 58 శాతం మంది ఆస్తుల విలువ రూ. కోటి కంటే ఎక్కువ ఉండగా, 2014లో ఇది 82 శాతానికి, 2019లో 88 శాతానికి పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన దాదాపు అన్ని పార్టీల్లోను కోటీశ్వరులైన అభ్యర్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనతాదళ్(యునైటెడ్), శివసేన(యూబీటీ), శివసేన, లోక్ జనశక్తి పార్టీ(రామ్‌విలాస్), రాష్ట్రీయ జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలున్నాయి. అయితే, ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలిచిన పార్టీలు కూడా ఇవే కావడం గమనార్హం. పెద్ద పార్టీలలో బీజేపీలో గెలిచిన 240 మంది అభ్యర్థుల్లో 95 శాతం మంది రూ. కోటి అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌లో 99 అభ్యర్థిల్లో 93 శాతం మంది కోటీశ్వరులు. ద్రవిడ మున్నేట్ర కళగం నుంచి గెలిచిన 22 మందిలో 95 శాతం మంది, ఆల్ ఇండియా తృణమూ కాంగ్రెస్‌లోని 29 మందిలో 93 శాతం, సమాజ్ వాదీ పార్టీ తరపున 37 మందిలో 92 శాతం మంది రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు.

ఆసక్తికరంగా, ఈ కోటీశ్వరుల్లో అత్యధికంగా 42(227) మంది రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ప్రకటించారు. రూ. 1-5 కోట్ల మధ్య ఆస్తులు ఉన్నవారు 32 శాతం(174) మంది ఉన్నారు. రూ. 5-10 కోట్ల మధ్య ఆస్తి ఉన్న అభ్యర్థులు 19 శాతం(103) మంది ఉన్నారు. గెలిచిన వారిలో గుంటూరు టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పెమ్మసారి అత్యధికంగా రూ. 5,705 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు. ఆ తర్వాత చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి రూ. 4,568 కోట్లు, బీజేపీ కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ రూ. 1,241 కోట్లతో ఉన్నారు. ఇక, పురూలియా నుంచి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహా రూ. 5 లక్షలతో అత్యల్ప ఆస్తులున్న అభ్యర్థిగా ఉన్నారు. ఆ తర్వాత ఆరంబాగ్‌కు చెందిన ఏఐటీసీ ఎంపీ మిటల్ రూ. 7 లక్షలు, మచ్లిషహర్ ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ రూ. 11 లక్షల ఆస్తులను వెల్లడించారు.

Advertisement

Next Story