కాంగ్రెస్‌కు 9 సీట్లు..బిహార్‌లో సీట్ షేరింగ్ ఖరారు!

by samatah |
కాంగ్రెస్‌కు 9 సీట్లు..బిహార్‌లో సీట్ షేరింగ్ ఖరారు!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ బిహార్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ షేరింగ్ ఖరారు కాలేదు. అయితే తాజాగా కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) మధ్య పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అంగీరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కిషన్‌గంజ్, కతిహార్, ససారాం, పాట్నా సాహిబ్, బేటియా, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, భాగల్‌పూర్, మాధేపురా లేదా సుపాల్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వెల్లడించాయి. అయితే దీనికి బదులుగా జార్ఖండ్‌లో కాంగ్రెస్ తమకు రెండు సీట్లు ఇవ్వాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ జార్ఖండ్ లో రెండు సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి బిహార్‌లో 7 సీట్లు మాత్రమే ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి.

కాంగ్రెస్, ఆర్జేడీల మద్య కొంత కాలంగా సీట్ షేరింగ్ విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఔరంగాబాద్, బెగుసరాయ్, కతిహార్, పూర్నియా, సివాన్ స్థానాల్లో ఇరు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది. అంతేగాక కాంగ్రెస్ 11 సీట్లు అడగగా ఆందుకు ఆర్జేడీ అంగీకరించలేదు. దీంతో సీట్ షేరింగ్ విషయంలో ప్రతిష్టంబన నెలకొంది. తాజాగా ఈవిషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన తేజస్వీ యాదవ్ హస్తం పార్టీకి 9 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీఈసీ) భేటీలోనూ దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాగా, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లోనై ఓటమి పాలైంది. ఆర్జేడీ కూడా ఖాతా తెరవలేదు. 40స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 39చోట్ల విజయం సాధించింది.

Advertisement

Next Story