Independence Day : స్పెషల్ గెస్ట్‌లుగా 75 మంది ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు

by Hajipasha |
Independence Day : స్పెషల్ గెస్ట్‌లుగా 75 మంది ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా గురువారం (ఆగస్టు 15న) ఉదయం జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రత్యేక అతిథులుగా 75 మంది ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొననున్నారు. ఇందుకోసం వారంతా బుధవారం ఉదయాన్నే దేశ రాజధానికి చేరుకున్నారు. వారికి కేంద్ర ఆరోగ్యశాఖ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అనంతరం బస చేసేందుకు వసతి సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక బస్సులో వారిని ఢిల్లీ నగర పర్యటనకు తీసుకెళ్లారు. సిటీలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలను చూపించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల సేవలను కొనియాడారు. దేశ ఆరోగ్య రంగానికి క్షేత్రస్థాయిలో వెన్నెముకలా నిలుస్తున్నారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అందించిన సేవలు చాలా గొప్పవి అని అనుప్రియా పటేల్ తెలిపారు. వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story