KCR: అసెంబ్లీకి గులాబీ బాస్ డుమ్మా.. ఆ భయమే వెంటాడుతోందా?

by Shiva |
KCR: అసెంబ్లీకి గులాబీ బాస్ డుమ్మా.. ఆ భయమే వెంటాడుతోందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపైనే ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ బడ్జెట్ ఫుల్ సెషన్స్‌కు ఆయన వస్తారని, కాంగ్రెస్​ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా చూస్తే గవర్నర్ ప్రసంగం తొలి రోజున అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మధ్యలోనే వెళ్లిపోయారు. అయితే గవర్నర్ బడ్జెట్ ప్రసంగం రోజున సభ్యులకు మాట్లాడే అవకాశం రాదని ముందుగా తెలిసే కేసీఆర్ సభకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని టాక్. గతంలోనూ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చి బడ్జెట్​ప్రసంగం ముగియగానే వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు. ఈసారి సైతం గవర్నర్ ప్రసంగానికి వచ్చి మళ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇప్పటివరకు ఆరు రోజుల పాటు సభ జరిగింది. గవర్నర్​ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా కేసీఆర్ మాట్లాడేందుకు రాలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు, ఎస్సీ వర్గీకరణ పెట్టిన బిల్లుపై మాట్లాడేందుకు ఆయన అటెండ్ కాలేదు. కీలక బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ హాజరుకాకపోవడంపై సొంత పార్టీకి చెందిన నేతలే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

15 నెలల్లో 2 రోజులే హాజరు..

విద్యా, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం నిజంగా బీసీలందరూ స్వాగతించాల్సిన విషయం. ఈ అంశాల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచడం శుభపరిణామమని బీసీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై చర్చ జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చర్చలో భాగస్వామి అయ్యి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాల్సి ఉండేనని ఆ వర్గం నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఎక్కడా సూచనలు ఇవ్వకపోగా.. వారికి నేనున్నానంటూ భరోసా ఇవ్వలేదు. బీసీ బిల్లును స్వాగతించలేదు. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగానూ ఆయన సభకు రాకపోవడాన్ని ఆ వర్గం నేతలు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దాదాపు 15 నెలల్లో కేసీఆర్ కేవలం రెండు రోజులే అసెంబ్లీకి హాజరయ్యారు. ఇప్పటి వరకు రూ.57 లక్షల వేతనం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.

కేసు భయంతోనేనా..?

కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని, ఆయనకు ఇప్పటి వరకు చెల్లించిన గౌరవ వేతనాన్ని రికవరీ చేయాలంటూ కోర్టు కేసులు, స్పీకర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్లారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను రెగ్యులర్‌గానే అసెంబ్లీకి వస్తున్నానని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదని చెప్పడానికే కేసీఆర్ సభకు హాజరయ్యారని టాక్ వినిపిస్తోంది. కాగా, కేసీఆర్ సభకు రాకుండా పొందిన వేతనాన్ని రికవరీ చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు అందింది. అయితే, కేసీఆర్​కేవలం ఒక్క అసెంబ్లీకే కాదు.. అటు నియోజకవర్గానికి, క్యాంపు కార్యాలయానికి సైతం రావడం లేదని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

నియోజకవర్గంలో నిరసనలు..

గజ్వేల్​ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్​క్యాంపు కార్యాలయానికి బీజేపీ నేతలు ‘టు లెట్’​బోర్డు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన కేసీఆర్​15 నెలలుగా ఒక్కసారి కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని, కనీసం క్యాంపు కార్యాలయానికి సైతం రావడం లేదని వారు నిరసన తెలిపారు. అందుకే టు లెట్​బోర్డు పెట్టినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉన్నా.. నియోజకవర్గ ప్రజల సమస్యల పట్టించుకునే నాథుడు లేక అనాథలుగా మారారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్​అసెంబ్లీకి పోవడం లేదని, ఇటు నియోజకవర్గ క్యాంపు కార్యాలయానికి రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు మల్లన్నసాగర్​ ముంపు గ్రామాల యువకులు సైతం ఎమ్మెల్యే కేసీఆర్.. అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్​చేశారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. మల్లన్నసాగర్​సమస్యలపై స్పందించడం లేదని, అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం లేదని వారు ఆ లేఖలో ఆరోపించారు. అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే మల్లన్న సాగర్​సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. అసెంబ్లీలో చర్చించి నిర్వాసితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Next Story