స్వాతి మలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌పై 500 పేజీల చార్జిషీట్

by Harish |
స్వాతి మలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌పై 500 పేజీల చార్జిషీట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు బిభవ్ కుమార్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం 500 పేజీల చార్జ్ షీట్‌ను తీస్ హజారీ కోర్టులో దాఖలు చేశారు. దీనిలో దాదాపు 50 మంది సాక్షుల వాంగ్మూలాలు కూడా ఉన్నాయని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిభవ్ కుమార్‌‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్నటువంటి కోర్టు బిభవ్ కుమార్‌ను ఈనెల 30న భౌతికంగా తమ ముందు హాజరు పరచాలని ఆదేశించింది. జులై 30వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.

మే 13న ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ మలివాల్‌పై కుమార్ దాడికి పాల్పడ్డారని ప్రధాన ఆరోపణ. పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ నిబంధనల ప్రకారం తప్పుడు నిర్బంధం, మహిళపై దాడి చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మే 16న పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత ఆయన్ను మే 18న అరెస్టు చేశారు. అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపగా, ఆ తర్వాత పలుమార్లు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది. ఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఢిల్లీ హైకోర్టు గత శుక్రవారం దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్‌ దాఖలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed