Supreme Court : 38 ఏళ్ల తర్వాత ఎస్‌ఐ‌కు రూ.5లక్షల రివార్డు.. అసలేం జరిగిందంటే.?

by Sathputhe Rajesh |
Supreme Court : 38 ఏళ్ల తర్వాత ఎస్‌ఐ‌కు రూ.5లక్షల రివార్డు.. అసలేం జరిగిందంటే.?
X

దిశ, నేషనల్ బ్యూరో : 38 ఏళ్ల క్రితం ఓ పేరుమోసిన దోపిడీ దొంగను చంపి ప్రజలను రక్షించిన ఎస్‌ఐకు రూ.5లక్షలను రివార్డుగా అందించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రూ.లక్ష రివార్డు ప్రకటించడాన్ని జస్టిస్ సూర్యకాంత, దిపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ ఖండించింది. ఎస్ఐ రామ్ అవతార్ సింగ్ యాదవ్ వీరోచిత పోరాటానికి రూ.లక్షను రివార్డుగా ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఈ అంశంలో అధికారులు మరింత ఉదారంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడింది. జాతీయ పోలీసు పతకం కోసం యాదవ్ కేసును కొనసాగించలేదని బెంచ్ విచారం వ్యక్తం చేసింది. ఇది యూపీ పోలీసు శాఖలోని అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంది. అలాంటి పతకాన్ని ప్రదానం చేసి ఉంటే యూపీలోని మొత్తం పోలీసు బలగాలకు, అప్పీలుదారుకు ఇది పెద్ద ప్రోత్సాహకంగా ఉండేదని అభిప్రాయపడింది.

అసలేం జరిగిందంటే..?

యాదవ్ బండా జిల్లాలోని బిసాండా పోలీసు స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 1986 మర్చి 13న బస్సులో స్టేషన్‌కు వస్తుండగా ఆయుధాలతో దోపిడీ దొంగలు బస్సుపై ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. వెంటనే యాదవ్ స్పందించి తన రివాల్వర్‌తో ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో చిదావా అనే పేరు మోసిన దోపిడీ దొంగ చనిపోయాడు. ప్రయాణికులను ప్రాణాలకు తెగించి కాపాడటంతో ఆనాటి ఎస్పీ యాదవ్‌ను 1989లో రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు మెడల్ కోసం సిఫార్సు చేశారు. తదనంతరం ఆ ప్రతిపాదన విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఆనాడు ఎస్పీ చేసిన ప్రతిపాదన విషయంలో జాప్యంపై సుప్రీం కోర్టు తాజాగా విచారం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed