One Nation One Poll : ‘జమిలి’పై జేపీసీ ఏర్పాటుకు 48 గంటల డెడ్‌లైన్.. ఎందుకు ?

by Hajipasha |
One Nation One Poll : ‘జమిలి’పై జేపీసీ ఏర్పాటుకు 48 గంటల డెడ్‌లైన్.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల(One Nation One Poll) బిల్లులపై మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో ప్రభుత్వానికి మూడింట రెండోవంతు మెజారిటీ రాలేదు. జమిలి ఎన్నికల బిల్లులు అనేవి రాజ్యాంగ(Constitution) సవరణ బిల్లులు. వాటికి ఆమోదం లభించాలంటే తప్పకుండా మూడింట రెండోవంతు మెజారిటీ అవసరం. దీంతో తదుపరిగా సమగ్ర చర్చల కోసం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. జేపీసీ ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ సభకు తెలిపారు. జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్‌సభ స్పీకర్ పర్యవేక్షణలో జరగనుంది. స్పీకర్ ఓంబిర్లాకు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవి. ఎందుకంటే శుక్రవారం (డిసెంబరు 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాల సెషన్ ముగిసిపోతుంది. ఆలోగానే జేపీసీలో సభ్యులుగా ఎవరెవరు ఉంటారనేది స్పీకర్ ప్రకటించాలి. ఒకవేళ అలా జరగకుంటే.. జమిలి ఎన్నికల బిల్లులపై మంగళవారం రోజు లోక్‌సభలో ఓటింగ్‌తో చేసిన తీర్మానం గడువు ముగిసిపోతుంది.

అదే జరిగితే.. జమిలి ఎన్నికల బిల్లులను మరోసారి ఫ్రెష్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదంటే.. శుక్రవారం సాయంత్రంలోగా జేపీసీపై ప్రకటన చేయాల్సిన బాధ్యత లోక్‌సభ స్పీకర్‌పై ఉంటుంది. జేపీసీలో గరిష్ఠంగా 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. వీరిలో అత్యధికంగా 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. జేపీసీ సభ్యత్వం కోసం ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ కార్యాలయం అన్ని ప్రధాన పార్టీలను కోరినట్లు తెలుస్తోంది. ఏదైనా బిల్లుపై సమగ్ర చర్చలు, అధ్యయనం జరిపేందుకు జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తుంటారు. అవసరాన్ని బట్టి ఈ గడువును పొడిగిస్తుంటారు. జమిలి ఎన్నికలపై ఏర్పాటు కానున్న జేపీసీ మాజీ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ఉన్నతాధికారులతోనూ సంప్రదింపులు జరపనుందని సమాచారం.

Next Story

Most Viewed