బీజేపీకి 370 సీట్లు ఖాయం: ప్రధాని నరేంద్ర మోడీ దీమా

by samatah |
బీజేపీకి 370 సీట్లు ఖాయం: ప్రధాని నరేంద్ర మోడీ దీమా
X

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి స్వతహాగా 370 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ దీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో ఆదివారం జరిగిన జన్ జాతీయ మహాసభలో మోడీ ప్రసంగించారు. ఎన్డీయే 400 దాటగలిగితే బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ‘ఝబువా నుంచి లోక్‌సభ పోరును మోడీ ప్రారంభిస్తారని అంటున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీరు బీజేపీని ఆశీర్వదించారు. అందుకే కేవలం మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను’ అని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి మోడీ ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. దశాబ్దాల పరిపాలనతో కాంగ్రెస్ 100 ఏకలవ్య పాఠశాలలను మాత్రమే ప్రారంభించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం పదేళ్లలోనే రెట్టింపు పాఠశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఎన్నికలకు ముందే గ్రామాలు, పేదలు, రైతులు గుర్తుకు వస్తారని ఆరోపించారు.

రూ. 7,550 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం

ఝబువాలో పర్యటించిన మోడీ రూ.7,550 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలోని ఆహార్ అనుదాన్ యోజన కింద దాదాపు రెండు లక్షల మంది మహిళా లబ్ధిదారులకు నెలవారీ చెల్లింపులను పంపిణీ చేశారు.ఈ పథకం కింద, వెనుకబడిన తెగలకు చెందిన మహిళలకు పౌష్టికాహారం కోసం నెలకు రూ. 1,500 అందిస్తున్నారు. స్వామిత్వ పథకం కింద 1.75 లక్షల భూమి హక్కుల రికార్డుని కూడా అందజేశారు. అంతేగాక తాంత్యా మామా భిల్ విశ్వవిద్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీని రూ.170కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.

Advertisement

Next Story