ఈదురుగాలులకు కుప్పకూలిన బిల్‌బోర్డ్.. 8 మంది మృతి, 60 మందికి గాయాలు

by Shamantha N |   ( Updated:2024-05-13 17:02:19.0  )
ఈదురుగాలులకు కుప్పకూలిన బిల్‌బోర్డ్.. 8 మంది మృతి, 60 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఘట్కోపర్‌లో బలమైన ఈదురుగాలుల వీయడంతో భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు.

ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు వీస్తూ వర్షం పడింది. చెడ్డా నగర్‌ జింఖానా ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్‌ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. పదుల సంఖ్యలో జనాలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి పలువురిని రక్షించాయి.

గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు బృహన్‌ ముంబై మున్సిపల్‌ అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిని మహారాష్ట్ర సీఎం షిండే పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. దాదాపు 66 నిమిషాల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాదాపు 15 విమానాలను మళ్లించారు. పాల్ఘర్‌, థానే జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.

ఆరే, అంధేరీ ఈస్ట్ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బలమైన గాలుల కారణంగా థానే, ములుంద్ మధ్య ఉన్న ఓవర్ హెడ్ పరికరాల స్తంభం వంగిపోవడంతో సబర్బన్ రైళ్లు ప్రభావితమయ్యాయి. మెయిన్ లైన్‌లోని సబర్బన్ సర్వీసులను నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే ప్రతినిధి తెలిపారు.

అకాల వర్షం వల్ల థానేలోని కాల్వా సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. థానే, అంబర్‌నాథ్, బద్లాపూర్, కల్యాణ్, ఉల్హాస్‌నగర్‌ల్లో మోస్తరు వర్షం కురిసింది.

Advertisement

Next Story