ఎన్నికల వేళ 29 మంది నక్సలైట్ల ఎన్‌కౌంటర్.. మృతుల్లో సీనియర్ లీడర్

by Swamyn |
ఎన్నికల వేళ 29 మంది నక్సలైట్ల ఎన్‌కౌంటర్.. మృతుల్లో సీనియర్ లీడర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు మొదలవనుండగా ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కాంకర్ జిల్లాలోని హపటోలా అడవిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 29 మంది నక్సలైట్లు మృతిచెందారు. ఇంతభారీ మొత్తంలో నక్సలైట్లను మట్టుబెట్టడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని బస్తర్ రేంజ్ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్’(ఐజీ) పీ సుందర్రాజ్ వెల్లడించారు. చట్టవిరుద్ధమైన సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన సీనియర్ క్యాడర్స్ శంకర్, లలిత, రాజు తదితరులు ఉన్నారనే పక్కా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండా, కొరోనార్ గ్రామాల మధ్యనున్న హపటోలా అటవీప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఎదురుకాల్పులు ప్రారంభమైనట్టు వెల్లడించారు. సరిహద్దు భద్రతాదళాలు(బీఎస్ఎఫ్), రాష్ట్ర పోలీసులకు చెందిన డిస్ట్రిక్ రిజర్వు గార్డ్(డీఆర్జీ) సిబ్బంది సంయుక్తం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 29 మంది నక్సల్స్ హతమయ్యారని తెలిపారు. ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యానని చెప్పారు. మృతుల్లో ప్రముఖ నక్సల్స్ కమాండర్ శంకర్ రావు ఉన్నారని, ఆయనపై రూ.25లక్షల రివార్డు ఉందని ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధ్రువీకరించారు. ఘటనాస్థలంలో నాలుగు ఏకే-47, 303 రైఫిల్స్‌తోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తాజా ఎన్‌కౌంటర్‌ అనంతరం బస్తర్ రీజియన్‌లో ఈ ఏడాదిలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు మరణించిన నక్సలైట్ల సంఖ్య 79కి చేరింది. ఇదే నెల 2న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఈ నెల 19న(శుక్రవారం) 102 స్థానాలకు తొలి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, అందులో బస్తర్ నియోజకవర్గం సైతం ఉండటం గమనార్హం. 26న నిర్వహించనున్న రెండో దశ ఎన్నికల్లో కంకర్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.

అమిత్ షా అభినందనలు

భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సలైట్లను హతమార్చిన భద్రతా దళాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. దేశ అభివృద్ధి, శాంతి భద్రతలు, యువత భవిష్యత్తుకు నక్సలిజం శత్రువని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు అమిత్ షా ట్వీట్ చేశారు.


Advertisement

Next Story