'బీజేపీకి గుణపాఠంగా 2024 ఎన్నికలు.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కాషాయ పార్టీ'

by Vinod kumar |
బీజేపీకి గుణపాఠంగా 2024 ఎన్నికలు.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కాషాయ పార్టీ
X

కోల్‌కతా: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే ముందు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శుక్రవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి గుణపాఠం చెబుతాయని, ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆ పార్టీ సొంత పత్రిక జాగో బంగ్లా ఎడిటోరియల్‌ పేర్కొంది. ‘నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగ సంప్రదాయాలన్నింటినీ బీజేపీ తుంగలో తొక్కుతోంది. ఇది యావత్ జాతిని అవమానించడమే’ అని సంపాదకీయంలో రాసింది. ‘భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య పౌరులందరి కర్తవ్యం.

కానీ కాషాయదళం దానిని పూర్తిగా చెత్తబుట్టలో పడేసింది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌లోకి ఓ ఆదివాసీకి ప్రవేశం లభించింది. కానీ ప్రతిపక్షాల మద్దతు కోసమే ఈ పని చేశారు. ఇప్పుడు అదే ఆదివాసీని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోంది. ఆదివాసీపై వారికున్న ప్రేమ కేవలం ఓటు బ్యాంకు రాజకీయలే అని మోడీ-అమిత్ షా ప్రభుత్వం స్పష్టం చేసింది’ అని పేర్కొంది. పాత బిల్డింగ్ ఇంకా బలంగా ఉన్నప్పటికీ రూ. 14 వేల కోట్లతో కొత్త బిల్డింగ్ నిర్మాణం అవసరమా అని టీఎంసీ ప్రశ్నించింది. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు ఉమ్మడిగా బహిష్కరించడం, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై పోరాటం వంటి అంశాలను కూడా సంపాదకీయంలో ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed