Women Buried In Gravel : దారుణం.. ఇద్దరు మహిళలపై ట్రక్కు మట్టి‌లోడ్ పోశారు

by Hajipasha |
Women Buried In Gravel : దారుణం.. ఇద్దరు మహిళలపై ట్రక్కు మట్టి‌లోడ్ పోశారు
X

దిశ, నేషనల్ బ్యూరో : తమ భూమి మీదుగా రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన ఇద్దరు మహిళలతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. రోడ్డు పనుల కోసం తెచ్చిన ట్రక్కులోని మట్టిలోడ్‌ను నేరుగా ఆ మహిళలపై వేశారు. దీంతో వారిద్దరు మెడ వరకు మట్టికుప్పల్లో కూరుకుపోయి ఊపిరాడక విలవిలలాడారు. ఈ దారుణ ఘటన శనివారం రోజు మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా మంగావా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోతా జొరోట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇద్దరు బాధిత మహిళలను మమతా పాండే, ఆశా పాండేలుగా గుర్తించారు. రోడ్డు పనులు జరుగుతున్న భూమిని తాము గతంలో లీజుకు తీసుకున్నామని వారిద్దరు ఆందోళనకు దిగారు. వెంటనే నిర్మాణ పనులు ఆపేయాలంటూ మట్టి లోడ్‌తో వచ్చిన ట్రక్కు వద్ద నినాదాలు చేశారు.

దీంతో రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్న వారికి.. మమతా పాండే, ఆశా పాండేలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ట్రక్కు వద్ద బైఠాయించిన ఇద్దరు మహిళలపైకి ట్రక్కు డ్రైవర్‌ మట్టిని పారబోశాడు. మట్టికుప్పల్లో కూరుకుపోయిన మమత, ఆశలను గ్రామస్తులు రక్షించి హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన భోపాల్‌ కాంగ్రెస్‌.. రాష్ట్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించింది. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలపై మట్టి పోసిన డంపర్‌ను సీజ్ చేసిన పోలీసులు, నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed