బ్లింక్ఇట్ కొత్త సేవల ప్రారంభం.. 10 నిమిషాల్లో ఆంబులెన్స్ సేవలు

by S Gopi |   ( Updated:2025-01-02 16:43:25.0  )
బ్లింక్ఇట్ కొత్త సేవల ప్రారంభం.. 10 నిమిషాల్లో ఆంబులెన్స్ సేవలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్-కామర్స్ కంపెనీ బ్లింక్ఇట్ సరికొత్త సేవలను ప్రారంభించింది. ఫుడ్, కిరాణా సరుకులకే పరిమితమైన బ్లింక్ఇట్ సరికొత్తగా 10 నిమిషాల్లో ఆంబులెన్స్ వచ్చే విధంగా 'బ్లింక్ఇట్ ఆంబులెన్స్ ' సేవలను గురువారం ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా గురుగ్రామ్‌లో ఐదు ఆంబులెన్స్‌లతో కంపెనీ ఈ సేవలను మొదలుపెట్టింది. వినియోగదారులు ఈ ఆంబులెన్స్ సేవలను బ్లింక్ఇట్ యాప్ నుంచి నేరుగా బుక్ చేసుకునే వీలుంటుందని బ్లింక్ఇట్ సీఈఓ అల్బిందర్ దిండ్సా చెప్పారు. ప్రస్తుతం గురుగ్రామ్‌కే పరిమితమైనప్పటికీ మరో రెండేళ్లలో ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్టు ఆయన తెలిపారు. సాధారణ లైఫ్ సపోర్ట్ సర్వీసెస్ ఈ ఆంబులెన్స్‌లో సౌకర్యాలు ఉంటాయని అల్బిందర్ దిండ్సా వివరించారు. వీటిలో ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు స్ట్రెచర్, అత్యవసర మెడిసిన్, ఇంజెక్షన్లు, మానిటర్, సక్షన్ మెషిన్ వంటి ప్రాణాలను రక్షించే పరికరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రతి అంబులెన్స్‌లో ఒక పారామెడిక్, డ్యూటీ అసిస్టెంట్, సకాలంలో ఆసుపత్రికి చేర్చేలా శిక్షణ పొందిన డ్రైవర్‌తో కూడిన సిబ్బంది ఉంటారు. పట్టణాల్లో తక్కువ సమయంలో, నమ్మకమైన ఆంబులెన్స్ సేవలు అందించే విషయంలో ఇది మొదటి అడుగని దిండ్సా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed