- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై క్లారిటీ !
దిశ, నేషనల్ బ్యూరో : మరో వారం, పది రోజుల్లోగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కీలక తరుణంలో అకస్మాత్తుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 14న మరో కేంద్ర ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే(65) రిటైరయ్యారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈనేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రెండు కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టులను భర్తీ చేసేందుకు మోడీ సర్కారు కసరత్తు చేస్తోంది. మార్చి 15లోగా వాటిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ సెక్రటరీ, సిబ్బంది శాఖ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు ప్యానళ్లుగా విడిపోయి చెరో ఐదుగురి పేర్లను రెండు పోస్టులకు ప్రతిపాదిస్తారు. ఈ రెండు లిస్టులను ఆయా ప్యానళ్లు సెర్చ్ కమిటీకి సమర్పిస్తాయి. అనంతరం ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో విపక్ష నేతతో కూడిన ఎంపిక కమిటీ మొత్తం పది మంది పేర్లను పరిశీలించి.. వారిలో ఇద్దరి పేర్లను ఎన్నికల కమిషనర్ పోస్టులకు ఖరారు చేస్తుంది. మార్చి 13 లేదా 14 తేదీల్లో ప్రధాని సారథ్యంలోని ఎంపిక కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. మార్చి 15లోగా నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
దీదీ ఏమన్నారంటే..
కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ఒత్తిడికి లొంగిపోనందుకు ఆయనను ప్రశంసించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓడిపోవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ర్యాలీలో ఆమె ప్రసంగించారు. గోయల్ ఆకస్మిక రాజీనామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని తెలిపారు. బీజేపీ ఒత్తిడికి లొంగని అరుణ్ గోయల్‌కు సెల్యూట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం అంటే ఏమిటో తేలిపోయిందని విమర్శించారు.
గోయల్ రాజీనామాకు కారణాలేంటి ? : జైరాం రమేశ్
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ గోయల్ రాజీనామా పలు అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుపై ఉందన్నారు. మోడీ ప్రభుత్వంతో విభేదాల కారణంగా గోయల్ రిజైన్ చేశారా? వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగారా? ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా లాగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? అనేదానిపై క్లారిటీ ఇవ్వాలన్నారు.
ఒత్తిడి వల్లే అరుణ్ గోయల్ రాజీనామా: అఖిలేష్
ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయెల్ రాజీనామా చేయడంతో ఈసీపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారేమో అనే సందేహాలు కలుగుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం ఎక్కువ ఒత్తిడితో పనిచేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఎన్నికల అధికారులు కూడా ఒత్తిళ్లకు గురై ఉద్యోగాలను వదిలేయాల్సి వస్తోందని ఆరోపించారు.