Nipah Virus: కేరళలో ‘నిపా’ కలకలం.. ఇద్దరు మృతి

by Vinod kumar |
Nipah Virus: కేరళలో ‘నిపా’ కలకలం.. ఇద్దరు మృతి
X

తిరువనంతపురం: కేరళలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి కొజికోడ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నిర్ధారించింది. తొలి మరణం గత నెల 30న నమోదవగా, రెండో మరణం సోమవారం నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దీంతో పరిస్థితిని సమీక్షించడానికి, వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి రాష్ట్రానికి ఓ కేంద్ర బృందాన్ని పంపామని తెలిపారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం సైతం వైద్య అధికారులను అప్రమత్తం చేసింది. కొజికోడ్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

ప్రజలంతా మాస్కులు ధరించాలని సూచించింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ సోకినవారితో సన్నిహితంగా ఉన్నవారు చికిత్స పొందుతున్నారని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, నిపా వైరస్ గబ్బిలాల ద్వారా మనుషులకు, జంతువులకు సోకుతుంది. ఇది ప్రాణాంతక వైరస్. ఈ వైరస్ బారినపడినవారిలో శ్వాసకోశ సమస్యలు, జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కేరళలో నిపా వైరస్ బయటపడటం ఇదే తొలిసారి కాదు. 2018లో కొజికోడ్‌తోపాటు మళప్పుఱం జిల్లాల్లో, 2021లో మరోసారి కోజికోడ్‌ జిల్లాలోనే ఈ కేసులను గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed