సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ అత్యుత్తమ అవార్డు

by Anukaran |
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ అత్యుత్తమ అవార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ప్లెయాష్(బూడిద) సద్వినియోగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫ్లెయాష్ వినియోగ సంస్థగా అవార్డు లభించింది. గోవాలో రెండు రోజులుగా ఫ్లెయాష్ వినియోగంపై జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సు ముగింపు సందర్భంగా శనివారం మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ డైరెక్టర్ మనోజ్ కుమార్ నుంచి సింగరేణి డైరెక్టర్(ఇ&ఎం) డి.సత్యనారాయణ రావు ఈ అవార్డును స్వీకరించారు. 500 మెగావాట్ల పైబడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న థర్మల్‌ ప్లాంట్ల విభాగంలో సింగరేణికి ఈ అవార్డు లభించింది.

ఈ సందర్భంగా సింగరేణి సీ&ఎండీ ఎన్. శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఫ్లెయాష్, బాటంయాష్ లను ఏమాత్రం స్టాకు ఉంచకుండా నూరుశాతం సద్వినియోగం చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొదటి నుంచే కృషి చేస్తున్నామని, దీనికి ఫలితంగా జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లెయాష్ ను సిమెంటు కంపెనీలకు రవాణా చేశామని, 2020-21లో 16.86 లక్షల టన్నులు ఫ్లెయాష్ ను సిమెంటు కంపెనీలకు రవాణా చేసినట్లు ఆయన వివరించారు. ప్రధానంగా తమిళనాడుకు చెందిన ఎ.సి.సి కంపెనీకి విద్యుత్ కేంద్రం నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఫ్లెయాష్ ను సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నామని, ప్రస్తుతం సరఫరా జరుగుతుందని తెలియజేశారు.

బొగ్గు నుంచి ఉత్పత్తి అయిన ఫ్లెయిష్ ను ఎప్పటికప్పుడు రవాణా చేయడం వల్ల పూర్తి పర్యావరణహిత ప్లాంటుగా సింగరేణికి గుర్తింపు వచ్చిందని తెలియజేశారు. అంతేకాకుండా ఎన్.టి.పీ.సీ, ఎస్.సి.ఎల్ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అదానీ, టాటా, జెకె వంటి సుమారు 150 ప్రైవేటు థర్మల్ విద్యుత్ కేంద్రాలను అధిగమించి సింగరేణి థర్మల్ ప్లాంటు కి ఈ అవార్డు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story