ఓవర్ లోడ్.. దెబ్బతింటున్న జాతీయ రహదారులు

by Sridhar Babu |
ఓవర్ లోడ్.. దెబ్బతింటున్న జాతీయ రహదారులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికార యంత్రాంగానికి పట్టింపు లేకుండా పోయింది. ఓవర్ లోడ్ ఇసుక దందా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్న నియంత్రించే నాధుడే లేకుండా పోయారు. అధికారిక రీచ్‌లో గుట్టుగా సాగుతున్న తతంగంపై ఫిర్యాదులు వెళ్తున్న టీఎస్ఎండీసీ క్షేత్ర స్థాయి విచారణకు ససేమిరా అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

నేషనల్ హైవేనే డ్యామేజ్..

ఇసుక లారీల దెబ్బకు ఏడాది కిందట వేసిన జాతీయ రహదారి కూడా దెబ్బతింటోంది. రోడ్ల నిర్మాణానికి ముందే ఇంజినీర్లు ఆ ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలు, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎన్ని టన్నుల బరువును తట్టుకునే శక్తి రోడ్డుకు ఉండాలో ప్రతిపాదిస్తారు. నేషనల్ హైవేల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటారు. అంతరాష్ట్ర వాహనాలు భారీ ఎత్తున బరువును తీసుకెళ్తాయని ప్రామాణాలను పాటించి రోడ్లను నిర్మిస్తుంటారు. అయితే భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ సమీపంలోని రోడ్డు ఏడాది క్రితమే వేసినా శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇంతకు ముందు కూడా కాటారం సమీపంలో ఇసుక లారీల ఓవర్ లోడ్ కారణంగా గుంతలు పడితే ప్యాచ్ వర్క్ చేయించారు. ఇసుక లారీల దెబ్బకు ఏకంగా జాతీయ రహదారే దెబ్బతిందంటే ఓవర్ లోడ్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

లారీకి రెండు బకెట్లు..

తవ్వినా కొద్ది వెలుతున్న ఇసుక దందాలో అక్రమాలు జరిగినా వెలుగులోకి వచ్చే అవకాశం లేదన్నదే రీచ్‌ల నిర్వహకులు, టీఎస్ ఎండీసీ అధికారుల ధీమా. రీచ్‌ల వద్ద ఎంత ఇసుక ఉంది, ఎంతమేర తీశారు అన్న వివరాలను సేకరించడం ప్రాక్టికల్‌గా అంత ఈజీ కాదన్నది వాస్తవం. గోదావరి నదిలోని ఇసుకకు హద్దులు, ఎంత పరిమాణంలో ఉందన్న కొలతలను తీసుకోవడం అసాధ్యం. ఇదే అదునుగా భావించిన నిర్వహకులు ఒక్కో లారీకి రెండు బకెట్ల చొప్పున అదనంగా ఇసుక లోడ్ చేస్తున్నారు. ఒక్కో బకెట్‌కు రూ. 2 వేల రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి క్వారీలో టీఎస్ఎండీసీ యంత్రాంగం ఉన్నప్పటికీ ఈ అక్రమ దందా మాత్రం ఆగడం లేదు.

ఫిర్యాదులు ఎన్ని వచ్చినా..

మహదేవపూర్ మండలం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిపై ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ విషయంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో పాటు, జిల్లా యంత్రాంగానికి, టీఎస్ ఎండీసీ అధికారులకు ఫిర్యాదులు వెల్లినా చర్యలు మాత్రం శూన్యం. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు సామాన్యులు కూడ ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకునే వారే లేకుండా పోయారు.

రెవెన్యూ బూచి..

ప్రభుత్వానికి ఇసుక రీచ్‌ల ద్వారా ఏటా వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్న బూచి చూపిస్తు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ప్రభుత్వానికి రెండు, మూడు వందల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేదని ఇప్పుడు వెయ్యి కోట్ల వరకూ ఆదాయం వస్తోందన్న సాకు చూపిస్తున్న అధికారులు ప్రభుత్వాన్ని కూడా మాయలో పడేశారన్న చర్చ సాగుతోంది. రెవెన్యూ వస్తోందన్న కారణంతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టేవారే లేకుండా పోయారన్నది అందరికీ తెలిసిన వాస్తవం.

Advertisement

Next Story

Most Viewed